Share News

మూడేళ్లుగా ఎదురుచూపులు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:15 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు మూడేళ్లుగా విడుదల కావడం లేదు. వీటిపై ఆధారపడ్డ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి. విద్యార్థులను వార్షిక పరీక్షల రుసుం చెల్లించాలని, పూర్తయిన వారికి ఒరిజనల్‌ సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. నిధులు విడుదల చేయాలని పలుమార్లు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడుతున్నారు.

మూడేళ్లుగా ఎదురుచూపులు

మంచిర్యాల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ప్రైవే టు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఉచిత విద్యాబోధన చేస్తున్నాయి. ఇందుకు గాను బోధనకు అయ్యే ఖర్చులన్నీ యాజమాన్యాలు అప్పోసప్పో చేసి భరిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తే చేసిన అప్పులతోపాటు తమ ఖర్చులకూ ఇబ్బందులు ఉండవని భావిస్తూ సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నాయి. మూడేళ్ళుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం, కళాశాలల నిర్వహణ తలకు మించిన భారం కావడంతో యాజమాన్యాలు ఆందోళన చెందుతుండగా, విద్యార్థులపైనా ఒత్తిడి పెరుగుతోంది. బోధనా రుసుం, ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో కొన్ని కళాశాలలు మూతపడడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో అధ్యాపకుల వేతనాలు చెల్లించి, కళాశాలలు నడిపించ డం కష్టంగా మారిందని పైవ్రేట్‌ యాజమాన్యాలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నాయి. పేరుకుపోయిన బకాయిల్లో సగం నిధులు విడుదలైనట్లు ప్రభుత్వం పేర్కొని ఏడాది కావస్తున్నా విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. దీంతో విద్యార్థులు, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారు.

రూ. 45 కోట్ల మేర బకాయిలు....

జిల్లాలో 2020-21 నుంచి 2023-24 వరకు మూడు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులు 20 వేల వరకు ఉండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు కలిపి రూ.40 కోట్ల నుంచి రూ. 45 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.

ఫ బీసీ సంక్షేమ శాఖలో ఎంటీఎఫ్‌ (స్టూడెంట్‌ మెయింటనెన్స్‌) రూ.3.50 కోట్ల బకాయిలు ఉండగా, ఆర్టీఎఫ్‌ (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) రూ.20.50 కోట్లు పెండింగులో ఉన్నాయి. ఈ బకాయిలు ఇలా ఉండగానే కొత్తగా చేరుతున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకుం టున్నారు. ఈబీసీ డిపార్టుమెంట్‌ ఆర్టీఎఫ్‌ రూ.2.50 కోట్లు బకాయిలు ఉండగా, మైనారిటీ కేటగిరీ కింద ఎంటీఎఫ్‌ రూ.1.30 కోట్లు, ఆర్టీఎఫ్‌ రూ.3.90 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖలో ఎంటీఎఫ్‌ రూ.2.20 కోట్లు ఉండగా, ఆర్టీఎఫ్‌ రూ.3.70 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా రూ.5.85 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం బకాయిల్లో దాదాపు రూ. 15 కోట్లకు ప్రొసీడింగ్స్‌తోపాటు 10 నెలల క్రితం టోకెన్‌ నెంబర్లు ఇచ్చినప్పటికీ ట్రెజరీల్లో పెండింగులో ఉన్నట్లు చూపిస్తోంది. విద్యార్థుల ఖాతాల్లో జమ కాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మిగతా రూ.20 నుంచి 25 కోట్లు ఇంతవరకు బడ్జెట్‌ కేటాయించలేదు.

విద్యార్థుల ఇబ్బందులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వాలు సకాలంలో విడుదల చేయని కారణంగా ప్రైవేటు కళాశా లల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. బోధనా ఫీజులు చెల్లిస్తేనే వార్షిక పరీక్షల రుసుం అనుమతిస్తామని నిబంధనలు పెడుతుండటంతో విద్యా ర్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థుల కోర్సులు పూర్తయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాకపోవడంతో యాజమాన్యాలు ఒరిజినల్‌ సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాక, ఇటు కాలేజీ ఫీజులు కట్టలేక బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ప్రభుత్వాల వైఖరి కార ణంగా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులకు స్వస్తి పలకాల్సిన పరిస్థితులు దాపురించాయి.

మూతపడుతున్న కళాశాలలు....

జిల్లాలో ఒకప్పుడు 14 డిగ్రీ, 14 జూనియర్‌ కళాశాలలు ఉంటే... ప్రస్తుతం 5 చొప్పున మిగిలాయి. నిర్వహణ భారమై యేటా కళాశాలలు మూతబడుతు న్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో డేటా సైన్స్‌, ఫుడ్‌ సైన్స్‌, డైరీ సైన్స్‌, బీబీఏ తదితర కోర్సులు అందుబాటులో లేవు. ప్రైవేటులో మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు కళాశాలకు రావాలంటే బస్సులు నడపక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. నిర్వహణ భారంతో కళాశాలలు ఎత్తివేస్తుండటంతో విద్యార్థులు ఆ విభాగాల్లోని విద్యకు దూరమవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కొక్కటిగా కళాశాలలు మూసివేతకు గురై విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

బీసీ విద్యార్థుల సమర శంఖారావం....

ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమర శంఖారావం పూరిస్తున్నారు. ఈ నెల 30న హైద్రాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం పేరుతో ప్రత్యక్ష ఆందో ళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఫీజుల కోసం బీసీ విద్యార్థిలోకం ధర్నా నిర్వహిస్తుండగా, అనంతరం కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టే యోచనలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఉన్నారు.

నిధులు విడుదల చేయాలి

ఉదారి చంద్రమోహన్‌గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు విడుదల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవస రం ఉంది. విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిర్వహణ భారమై కళాశాలలు మూసివేతకు గురైతే విద్యార్థులు నష్టపోవడంతోపాటు వాటిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

Updated Date - Jan 17 , 2025 | 11:15 PM