రైతుభరోసా రూ.15 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:49 PM
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఊత్కూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ యేటా రైతుకు పంట పెట్టుబడికి రూ.15వేలు ఇస్తామంటూ ఏడాది అనంతరం రూ.12వేలు ఇస్తామనడం సరికాదన్నారు.

లక్షేట్టిపేట, జనవరి (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఊత్కూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ యేటా రైతుకు పంట పెట్టుబడికి రూ.15వేలు ఇస్తామంటూ ఏడాది అనంతరం రూ.12వేలు ఇస్తామనడం సరికాదన్నారు. నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు, రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రైతులకు రూ.15వేలు ఇచ్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పోలీసులు నాయకులకు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, కౌన్సిలర్ చాతరాజు రాజన్న, దండేపల్లి మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెన్నూరు, (ఆంధ్రజ్యోతి) : రైతులను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నాడని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. రైతు భరోసా యేటా రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలు ఇస్తామనడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం చెన్నూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు. రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏడాదిగా రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని ఊరించి రూ. 12 వేలు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని తెలిపారు. మాయమాటలు చెప్పి రైతులతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక అన్యాయం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకొన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
జైపూర్, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గ నాయకుడు రాజారమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తానని మాట ఇచ్చి చివరకు రూ. 12 వేలు ఇస్తామని ప్రటించడం రైతులను మోసం చేయడమేనని తెలిపారు. నాయకులు అరవిందరావు, తిరుపతి, లింగస్వామి, జగన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.