క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:02 PM
కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.

మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు వాహనాలను పట్టుకొని జరిమానాలు విధిస్తూ సరిపెడుతున్నారు. మందమర్రి మండలంలోని బొక్కల గుట్టతోపాటు దండేపల్లి మండలంలోని పుణ్యక్షేత్రమైన గూడెం సత్యనారాయణ స్వామి గుట్టను కూడా నామరూపాల్లేకుండా కొల్లగొడుతున్నారు.
అనుమతులు లేకున్నా..
బొక్కలగుట్ట, గూడెం గుట్టల్లో మట్టి తవ్వకాలకు ఉన్న పరిమితులు దాటి తవ్వకాలు చేపడుతున్నా అడిగే వారు లేరు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ అక్రమంగా లక్షలు గడిస్తున్నారు. మట్టి తవ్వకాలకు నిబంధనల మేరకు ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.75 అడ్వాన్స్ రాయల్టీ, 30 శాతం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్టీ), 2 శాతం స్టేట్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు(ఎస్‌ఎంఈటీ) ఫీజులతోపాటు 2 శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మట్టి తవ్వకాలు జరిపే సమయంలో ప్రతిసారీ మళ్లీ పర్మిట్లు తీసుకోవలసి ఉంటుంది. ఇవేమీ చెల్లించకుండానే నిత్యం దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకు పోతున్నట్ల్లు సమాచారం. గుట్టల నుంచి తవ్విన మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్న వారు కోట్లు గడిస్తుండగా, ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడు తోంది. మట్టితో పాటు పర్మిట్లు లేకుండా గుట్టల్లో రాయి తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటు న్నారు. బొక్కలగుట్ట నుంచి గృహ అవసరాల కోసం రాయిని తవ్వేందుకు తిమ్మాపూర్ శివారు 139 సర్వే నెంబర్‌లో మోహన్, సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తులకు 1.10 ఎకరాలు, 2 ఎకరాల చొప్పున లీజుకు ఇస్తూ మైనింగ్ శాఖ పర్మిట్లు జారీ చేసింది. సదరు కాంట్రాక్టర్లు తమ పరిధి దాటి తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కువ తవ్వకాలు జరిపిన ఇద్దరు లీజుదారులకు మైనింగ్‌శాఖ అధికారులు జరిమానాలు సైతం విధించారు. రాయల్టీ చెల్లించకుండా తవ్వకాలు జరిపిన క్వారీ నిర్వాహకులకు అధికారులు జరిమానా విధించారు. బొక్కలగుట్ట మండలం తిమ్మాపూరుకు చెందిన భీమ సుధాకర్‌కు రూ.1.46 కోట్లు, పులిమడుగు గ్రామానికి చెందిన భుక్య మోహన్‌కు రూ.1.62 కోట్లు జరిమానా విధించడం గమనార్హం. అయినా లీజుదారుల్లో మార్పులు రావడం లేదు. ఇదిలా ఉండగా వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధించగా అవి చెల్లించకపోవడం, కోర్టులో కేసులు ఉండడంతో ఈ రెండు క్వారీల అనుమతులు ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ యథావిధిగా క్వారీల నుంచి మొరం, రాయి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్థానికంగా ఓ పలుకుబడి కలిగిన నేత ఈ అక్రమ వ్యవహారం చేస్తూ దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే గూడెం గుట్ట నుంచి పెద్ద మొత్తంలో మొరం, బండ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
డిజిటల్ సర్వే బాధ్యతలు..
గుట్టలు, ఇతర ప్రభుత్వ భూముల నుంచి రాళ్లు, మట్టి తవ్వకాలపై నిఘా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీఎస్, ఈటీఎస్ అనే డిజిటల్ సర్వే బాధ్యతలను మహారాష్ట్రలోని నాగపూర్ చెందిన ఓ ఏజెన్సీకి అప్పగిం చింది. ఆయా స్థలాల్లో జరుగుతున్న తవ్వకాలపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు శాటిలైట్‌తో నిఘావేసి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలి. గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లో అనుమతులున్న కాంట్రాక్టర్లు తమ పరిధిలోనే తవ్వకాలు చేపడుతున్నారా, అక్రమాలకు పాల్పడుతు న్నారా గమనించాల్సి ఉంది. దీంతోపాటు ఎంత విస్తీర్ణం లో రాయి, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో సర్వే జరిపి మైనింగ్ శాఖ అధికారులకు రిపోర్టు చేయాలి. ఆయా సంస్థలు ఎలాంటి సర్వే జరుపకపోవడంతో గుట్టలో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది.