ప్రశ్నార్ధకంగా డబుల్ బెడ్రూం ఇళ్లు...!
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:51 PM
సొంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు వృథాగా పడి ఉన్నాయి.

మంచిర్యాల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): సొంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు వృథాగా పడి ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడంతో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి.
పంపిణీకి నోచుకోని ఇళ్లు...
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,656 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 1206 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 160 నిర్మాణ దశలో ఆగిపోయాయి. నిర్మా ణం పూర్తయిన వాటిలో కేవలం 330 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మరో 1176 ఇళ్లు పంపిణీ చేయాల్సి ఉండగా సంవత్సరాలు గడుస్తున్నా వాటికి ముహూర్తం కలిసిరావడం లేదు. వాటి నిర్మాణం కోసం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కదానికి రూ.5.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించింది. విడుతల వారీగా రూ.86.68 కోట్లు మంజూరుకాగా రూ. 62 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 1406 ఇళ్లకు మాత్ర మే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి నిర్మాణాలు చేపట్టారు.
మంచిర్యాల నియోజకవర్గానికి 650 ఇండ్లు మంజూరు కాగా 360 పూర్తయ్యాయి. ఇందులో కేవలం 330 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా, మిగతా చోట్లా ఎక్కడ కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవు.
చెన్నూరు నియోజకవర్గంలో 846 ఇళ్లు మంజూరు కాగా ఒక్కటి కూడా పంపిణీకి నోచుకోలేదు. బెల్లంపల్లి నియోజక వర్గానికి మంజూరైన 160 ఇళ్లలో ఒక్క నిర్మా ణం కూడా పూర్తికాలేదు. ఇళ్లన్నీ కూడా నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం అవన్నీ వృథాగా మారే అవకాశాలు ఉన్నాయి.
లబ్ధిదారులను ఎంపిక చేసినా...
రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపునకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొదటి విడుతలో భాగంగా జిల్లా కేంద్రంలో 360 గృహాలను అర్హులకు కేటాయించేందుకు అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా మీ-సేవ ద్వారా అందిన 2,958 ధర ఖాస్తులను పరిశీలించిన అధికారులు వార్డుల వారీగా 1621 మందిని అర్హులుగా గుర్తించి, వారి జాబితాను 2022 ఆగస్టు 29న మున్సిపల్, తహసీల్దార్ కార్యాల యాల్లో ప్రచురించారు. జాబితాపై ఆక్షేపణలు ఉంటే అది ప్రచురితమైన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు. ప్రాథమిక జాబితా పట్ల అందే ఆక్షేపణలను పరిగణలోకి తీసుకొని తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీపూర్తిస్థాయిలో పంపిణీ జరుగలేదు.
కొత్త నిర్మాణాలకే మొగ్గు....
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’ఇందిరమ్మ’ పథ కంలో భాగంగా కొత్త ఇళ్లను నిర్మించే అవకాశాలే మెం డుగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నమూనా రూపొందించింది. ఆ నమూనా ప్రకారమే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వాటినే లబ్ధిదారులకు పంపిణీ చేయాలనే తలంపుతో ఉన్నారు. మొదటి విడుతలో స్థలం ఉన్నవారు, ఇళ్లు ఉండి కూలిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఆ తరువాత స్థలం లేని వారికి నేరుగా ఇళ్లు ఇచ్చే ప్రక్రియను చేపట్టనున్నారు. ఇదే విషయమై కలెక్టర్ నేతృత్వంలో ఎంపీడీవో ప్రత్యేకాధికా రిగా బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాల ఆధ్వ ర్యంలో అర్హుల గుర్తింపునకు సర్వే తుది దశకు చేరు కుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలో బీఆర్‌ఎస్ సర్కారు నిర్మించిన డబుల్ ఇళ్ల ప్రస్తావన లేకపోవడంతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న వాటి పరిస్థితి ఏమిటనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
’’ఇందిరమ్మ’’ వర్తించేనా...?
జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో 2007-08లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు లేని నిరుపేదలకు సర్వే నెంబర్ 345లో నివేశన స్థలాలు పంపిణీ చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతోపాటు 75 గజాల చొప్పున స్థలాలనూ అప్పగించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అప్పటి 32 వార్డుల్లో 22 వార్డులకు చెందిన సుమారు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వాటిలో దాదాపు 80 శాతం మంది లబ్ధిదారులు రూ.50వేల నుంచి లక్ష వరకు ఖర్చుచేసి బేస్మెంట్లు, పిల్లర్లు నిర్మించుకున్నారు. మరికొందరు స్థలాలను ఖాళీగా ఉండగా, మరి కొందరు ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఆ తరు వాత ప్రభుత్వం మారి ఇందిరమ్మ పథకం మరుగున పడగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్ బెడ్రూం ఇళ్ల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో 2019-20 మధ్యకాలంలో అధికారులు సర్వే నెంబర్ 345లో వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఆందోళనకు దిగడంతో అధికారులు వారితో సంప్రదింపులు జరిపారు. స్థలాలు కోల్పోయిన వారిని డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఉన్న కట్టడాలను తొలగించి అదే ప్రాంతంలో డబుల్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే డబుల్ బెడ్రూం ఇళ్లలోనూ వారికి మొండిచేయి చూపారు. ప్రస్తుతం ఇందిరమ్మ పథకం మళ్లీ తెరపైకి రావడం, గతంలో ఎమ్మెల్సీ హోదాలో పట్టాలు పంపిణీ చేసిన కొక్కిరాల ప్రేంసాగర్ రావే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో తమకు ఇం దిరమ్మ పథకంలో తిరిగి అవకాశం కల్పిస్తారేమోనని బాధితులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.