Share News

యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:19 PM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించే కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యాయి. గత ఏడాది వర్షాకాలంలో భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతినడంతోపాటు పలు గేట్లు మొరాయించాయి. నీటి లీకేజీ కారణంగా సకాలంలో నీరందక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం

మంచిర్యాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించే కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యాయి. గత ఏడాది వర్షాకాలంలో భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతినడంతోపాటు పలు గేట్లు మొరాయించాయి. నీటి లీకేజీ కారణంగా సకాలంలో నీరందక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతాంగానికి సాగునీరు అందలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి రూ.10 కోట్లు కేటాయించడంతో ఆనకట్టతో పాటు గేట్ల మరమ్మతు పనులు పూర్తికావడంతో యాసం గి సీజన్‌కు సాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. కడెం ప్రాజెక్టు ద్వారా నిర్మల్‌ జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో సాగునీరు అందుతోంది. యాసంగిలో కడెం నీటిని డిస్ట్రిబ్యూటరీ 1 నుంచి 28 వరకు పరిధిలో సాగు నీరు అందించనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని దండేపల్లి మండలం గూడెం గోదావరి నది ఒడ్డున ఉన్న సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా డిస్ట్రిబ్యూటరీ 30 నుంచి 42 వరకు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రయల్‌రన్‌ విజయవంతం..

యాసంగి సాగు కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా అందించేందుకు ఇటీవల ట్రయల్‌ రన్‌ నిర్వహించగా విజయవంతమైంది. దీంతో నీటి విడుదలకు ఇబ్బందులు తొలగిపోయాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. కాగా ప్రస్తుతం 605 అడుగుల నీరు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీసీఎంసీలకు ప్రస్తుతం 19.56 టీఎంసీలు ఉంది. కడెం ప్రాజెక్టులో ఉన్న నీరు ఆరుతడి పంటలకే సరిపోతుందని చెబుతు న్నారు. దీంతో యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సరిపడా నీరు ఉండడంతో..

ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉండడంతో యాసంగి సాగుకు నీరు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయిన నేపథ్యంలో జనవరి 5వ తేదీ నుంచి నీరు విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ 1 నుంచి 42 వరకు కాలవల ద్వారా సుమారు 16వేల ఎకరాలకు నీటిని విడుదల చేయనున్నారు. యాసంగికి నీరు అందనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:19 PM