జిల్లా కేంద్రంలో పెరుగుతున్న అసాంఘిక చర్యలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:33 PM
వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులతో జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరి మూకలు అదును చూసి, గ్యాంగులతో కలిసి ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు, ఎవరిపైన దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.

మంచిర్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులతో జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరి మూకలు అదును చూసి, గ్యాంగులతో కలిసి ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు, ఎవరిపైన దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేస్తుండటంతో ఎవరిపై ఎవరు దాడి చేసి కొట్టారో అర్థంకాని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఈ నెల 15న ఉదయం చేపల మార్కెట్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు మిట్టపల్లి జయరామారావుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టారు. దాడి కాంగ్రెస్ పార్టీ నాయకుల పనేని పేర్కొంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమకు సంబంధంలేని గొడవను ఆపాదించడాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం డీసీపీ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు.
పెరిగిన సెటిల్‌మెంట్‌లు....
జూదం, వ్యభిచారం, సెటిల్‌మెంట్లు, గంజాయి వినియోగం, మారణాయుధాల వాడకం జిల్లా కేంద్రంలో పెరిగిపోయింది. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కులు వచ్చి ఇక్కడ దందాలు నిర్వహి స్తున్నారు. ఎదురు తిరిగిన వారిని మారణాయుధాలతో చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కత్తులు, తల్వార్‌లు, తుపాకులు, ఇతర మారణాయుధాలతో సంచరిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతుండటం హింసాకాండను తలపిస్తోంది.
దాడులతో భయానక వాతావరణం....
మంచిర్యాల పట్టణంలో అభివృద్ధితోపాటు అసాం ఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. జనాభా పెరు గుతుండటంతో అక్రమ దందాలు కూడా అడ్డగోలుగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ స్థలాలు, పట్టా భూములను కబ్జా చేయడం, అందులో అక్రమ నిర్మా ణాలు చేపట్టడం, ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేయడం పెరిగిపోవడంతో పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు...
- బీఆర్‌ఎస్ నాయకుడు గడప రాకేష్‌పై జూన్ 2న హైటెక్‌సిటీ సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హాకీ స్టిక్స్‌తో దాడి చేశారు. అనంతరం రాకేష్‌పై దాడిచేసినట్లుగా భావిస్తున్న వారిపైనా పరస్పర దాడులు జరిగాయి.
-పట్టణంలోని తిలక్‌నగర్‌లో బతుకమ్మ సంబరాల సందర్భంగా కొందరు యువకులు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. పాతగొడవల కారణంగా దాడులకు పాల్పడగా పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు.
-హమాలివాడ సప్తగిరి కాలనీలో తోట విశాల్ అనే యువకుడిపై స్థానికులు కొందరు దాడి చేసి కొట్టారు.
-అశోక్‌రోడ్డులో దుర్గామాత నిమిజ్జనం సందర్భంగా శిరీష్ అనే వ్యక్తిపై డీజే సౌండ్ విషయంలో పలువురు వ్యక్తులు దాడి చేసి కొట్టారు.
-అక్టోబర్ 10న హమాలివాడలో పోతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కోమటి సత్తయ్యలపై భూమి విషయంలో పలువురు వ్యక్తులు దాడికి పాల్పడి వెంట తెచ్చుకున్న తల్వార్‌తో చంపేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో మంథని సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కుంట శ్రీనివాస్ పాల్గొనడం కలకలం రేపింది.
-అదే నెల 14న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఇంటిలోకి ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు కత్తులతో చొరబడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్‌మన్ అడ్డుపడటంతో అతనిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో నిందితులు ఇంకా పట్టుపడకపోగా ఎమ్మెల్యే ఇంట్లోకి దుండగులు ఎందుకు ప్రవేశించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలు గడిచినా ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ దుండగులను పోలీసులు ఇప్పటిదాకా పట్టుకోలేదు.
-అక్టోబర్ 18న హాజీపూర్ మండల మాజీ ఎంపీపీ రమాదేవి భర్త, మాజీ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌పై కొందరు వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రత్యర్థివర్గం కూడా శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-డిసెంబరు 18న నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు నయీంపాష పైనా కొందరు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.