Share News

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:26 PM

పోలీసులు క్రమశిక్షణ కలిగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌పరేడ్‌)కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

హాజీపూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలీసులు క్రమశిక్షణ కలిగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌పరేడ్‌)కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 548 మంది శిక్షణ కానిస్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడం ఆనందంగా ఉందని, ప్రజల రక్షణ, భద్రత కోసం పనిచేయాలన్నారు. పోలీసు శాఖకు గౌరవం తీసుకువచ్చేలా విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని తెలిపారు. కుల, మత వర్గాలకు అతీతంగా రాగద్వేషాలకు తావివ్వకుండా విధులు నిర్వహిస్తూ సమాజంలో ఏ అండ లేని బలహీన వర్గాల ప్రజల రక్షణ, అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎప్పుడైతే శాంతి భద్రతలు, నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్నారు. నేడు ప్రధానంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం, సైబర్‌ నేరాల సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. వీటిని అణిచివేయడానికి పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. శిక్షణ సమయంలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. అనంతరం కమాండెంట్‌ వెంకటరాములు మాట్లాడుతూ 2024, ఏప్రిల్‌ 1న 572 మంది కానిస్టేబుళ్లు శిక్షణకు బెటాలియన్‌లో రిపోర్టు చేశారన్నారు. ఇందులో ఇద్దరు ఫైర్‌ డిపార్టుమెంట్‌, ఇద్దరు ప్రభుత్వ టీచర్‌, 11 మంది గ్రూప్‌ 4, ఒకరు జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. మరో పది మంది వివిధ కారణాలతో శిక్షణ నుంచి వెళ్లిపోయారన్నారు. 542 మందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. అనంతరం శిక్షణ కానిస్టేబుళ్లు పలు విన్యాసాలను ప్రదర్శించారు. డీసీపీ భాస్కర్‌, అడిషనల్‌ డీసీపీ రాజు, అసిస్టెంట్‌ కమాండెంట్‌లు నాగేశ్వర్‌రావు, కాళిదాసు, మెడికల్‌ ఆఫీసర్‌ సంతోష్‌సింగ్‌, ఏవో ఉమేష్‌కుమార్‌, జీఎం సూర్యనారాయణ, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:26 PM