Dharma Yuddham Maha Sabha: ధర్మయుద్ధం సభకు పోటెత్తిన ఆదివాసీలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:01 PM
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా ఆదివాసీలు పోటెత్తారు.
ఆదిలాబాద్, నవంబర్ 23: ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో గ్రౌండ్‌లో జరుగుతున్న మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. గత అనుభవాల దృష్ట్యా ఈ మహాసభను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. ఉట్నూర్ వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసీఫాబాద్ మార్గాల్లో ప్రయాణించే వాహనాలను గుడిహత్నూర్ క్రాస్ రోడ్డు వద్ద నిలిపివేశారు. వీటిని నిర్మల్ వైపు దారి మళ్లించారు.

రాష్ట్ర శాంతి భద్రతల డీజీ మహేశ్ భగవత్ శనివారం నుంచి ఉట్నూరులోనే ఉండి బందోబస్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆదివాసీలు తప్ప మరొకరు ఈ ప్రాంతంలోకి రాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు.
ఆ తర్వాత ఉద్యమం కాస్తా చల్లబడినట్లు కనిపించినా.. ఇటీవల కాలంలో ఆదివాసీల నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అందుకోసం ఆదివాసీ సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. తమకు రావాల్సిన రిజర్వేషన్లను దొడ్డి దారిన లంబాడాలు దోచుకుంటున్నారని ఆదివాసీల నేతలు ఆరోపిస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే దాక తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి
హ్యాకైన మంత్రుల వాట్సాప్ గ్రూపులు.. !
For More TG News And Telugu News