Pension: పింఛన్ కోసం 80 ఏళ్ల వృద్ధురాలి ఎదురుచూపు
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:10 AM
ఆమెను చూసుకునేందుకు పిల్లలు లేరు. సర్కారు ఇచ్చే పింఛన్‌కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఆ వృద్ధురాలు జాతీయ జెండాకు విన్నవించుకున్న చిత్రం సోషల్‌మీడియా ద్వారా సోమవారం వెలుగుచూసింది.
జాతీయ జెండాకు విన్నవించుకున్న వైనం
గరిడేపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆ వృద్ధురాలి వయసు 80 ఏళ్లు. భర్త కన్నుమూశాడు. ఆమెను చూసుకునేందుకు పిల్లలు లేరు. సర్కారు ఇచ్చే పింఛన్‌కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఆ వృద్ధురాలు జాతీయ జెండాకు విన్నవించుకున్న చిత్రం సోషల్‌మీడియా ద్వారా సోమవారం వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన లక్కమల్ల ఆరోగ్యమ్మ భర్త ఐదేళ్ల క్రితం మృతిచెందాడు.
కొద్ది రోజుల క్రితం ఆరోగ్యమ్మ కాలు విరగడంతో నడవలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాల వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగురవేసిన జాతీయ జెండా వద్దే ఆమె వేచి ఉంది. తనకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంది. పెద్దలు, ఉపాధ్యాయులు ఆ వృద్ధురాలికి నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఈ విషయమై ఎంపీడీవో సరోజ వివరణ కోరగా పింఛన్ మంజూరు ప్రభుత్వ పరిధిలో నిదని, ఆమె మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు.