Higher Education: ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో 67 శాతం సీట్లు ఖాళీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:44 AM
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూవిజ్ఞాన శాస్త్ర..
మొత్తం120లో 40 సీట్లు మాత్రమే భర్తీ
28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్న వర్సిటీ
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూవిజ్ఞాన శాస్త్ర (ఎర్త్ సైన్సెస్) విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం ఎదురుచూస్తోంది. ఉపాధికి విస్తృత అవకాశాలున్న కోర్సులు అందిస్తున్నప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక, కోర్సుల విశిష్టతల గురించి ప్రచారం చేయకపోవడంతో తొలి విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు మూడో వంతు సీట్లే భర్తీ అయ్యాయి. ఇటీవలే ప్రారంభించిన ఈ వర్సిటీలో బీఎస్సీ జియాలజీలో 60, బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో 60 సీట్లున్నాయి. విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ వసతి ఉంది. అయితే దోస్త్ చివరి విడత ప్రవేశాల సమయంలో వర్సిటీ ప్రారంభంకావడంతో ప్రత్యేక కోర్సుల గురించి విద్యార్థులకు తెలియలేదు. గత వారం ప్రవేశాలు ముగిసేనాటికి బీఎస్సీ జియాలజీలో 11 సీట్లు, బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో 29 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం 120 సీట్లలో 40 సీట్లే భర్తీ కాగా 80 సీట్లు (67 శాతం) మిగిలిపోయాయి. ఈ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకు పొడిగించారు. అప్పటికీ భర్తీ కాకపోతే ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. మూడేళ్ల బీఎస్సీ జియాలజీలో ప్రవేశాలకు ఇంటర్‌లో ఎంపీసీ, ఎంబీపీసీ, తత్సమానమైన బ్రిడ్జి కోర్సు చేసినవారు, బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోసం ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంబీపీసీ, తత్సమాన బ్రిడ్జి కోర్సులు చేసిన వారు అర్హులని ప్రిన్సిపాల్ .జగన్మోహన్ రాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News