Share News

Telangana Bird Species: తెలంగాణలో 452 పక్షి జాతులు

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:22 AM

తెలంగాణ వ్యాప్తంగా 452 జాతుల పక్షులు నివసిస్తున్నాయని, వాటిలో కొన్ని అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ చెలమల శ్రీనివాసులు తెలిపారు.

Telangana Bird Species: తెలంగాణలో 452 పక్షి జాతులు

  • ఉస్మానియా ప్రొఫెసర్‌ పరిశోధనలో వెల్లడి

  • అంతరించిపోతున్న వాటి.. జాబితాలో రాబందు, లీస్సెర్‌ ఫ్లోరికాన్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ వ్యాప్తంగా 452 జాతుల పక్షులు నివసిస్తున్నాయని, వాటిలో కొన్ని అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ చెలమల శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్‌ బర్డ్‌ పల్స్‌ నిర్వాహకులు శ్రీరామ్‌ రెడ్డితో కలిసి గత 10 ఏళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో ఇప్పటి వరకు 452 పక్షి జాతులను గుర్తించామని శ్రీనివాసులు తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. వీటిలో కొన్ని అరుదైనవే కాకుండా దేశంలో తొలిసారిగా గుర్తించినవి కూడా ఉన్నాయని తెలిపారు. పక్షులు పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయని, కొన్ని కారణాల వల్ల భారతీయ రాబందు, లీస్సెర్‌ ఫ్లోరికాన్‌ వంటి కొన్ని జాతుల పక్షులు అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి అంతరించిపోవడం పర్యావరణానికి చేటన్నారు.


తెలంగాణలో మైదానాల నుంచి అడవుల వరకు, చెరువుల నుంచి గడ్డి మైదానాల వరకు వివిధ జాతులకు చెందిన పక్షులు ఆవాసం ఏర్పరుచుకున్నాయని, ఇవి కాకుండా కాలాలను బట్టి ఇతర ఖండాల నుంచి కూడా కొన్ని పక్షులు వలస వస్తాయన్నారు. హైదరాబాద్‌ బర్డ్‌ పల్స్‌ నిర్వాహకులు శ్రీరామ్‌ రెడ్డి మాట్లాడుతూ.. పక్షులను గమనించడం ఇష్టంగా కాకుండా పర్యావరణ ప్రాముఖ్యతతో చూడాలన్నారు. ఏళ్ల తరబడి పరిశోధన, చారిత్రక ఆధారాల పరిశీలన, స్థానికుల సహకారంతో సేకరించిన సమాచారంతో పరిశోధన పత్రాన్ని సమర్పించామన్నారు. పక్షులపై పరిశోధన పత్రాన్ని సమర్పించిన ప్రొఫెసర్‌ చెలమల శ్రీనివాసులు, హైదరాబాద్‌ బర్డ్‌ పల్స్‌ నిర్వాహకులు శ్రీరామ్‌ రెడ్డిల కృషిని ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ అభినందించారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 04:22 AM