Share News

Kukatpally: చోరీ కోసం వచ్చి.. పట్టుబడొద్దని చంపేసి!

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:03 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆరో తరగతి బాలిక సహస్ర (12) దారుణ హత్య మిస్టరీ వీడింది. పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లోని పదో తరగతి బాలుడే ఆమెను హత్య చేసినట్టు తేలింది.

Kukatpally: చోరీ కోసం వచ్చి.. పట్టుబడొద్దని చంపేసి!

  • కూకట్‌పల్లిలో బాలికను హత్య చేసింది.. పక్క అపార్ట్‌మెంట్‌లోని బాలుడే

  • ఇంట్లో ఎవరూ లేరనే అంచనాతో చోరీకి ప్లాన్‌.. గుర్తించి అడ్డుకున్న సహస్ర

  • అందరికీ చెప్తుందేమోన్న భయంతో కత్తితో పొడిచి పరారైన బాలుడు

  • అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించడంతో అంగీకారం!

  • తాగుబోతు తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో చోరీకి యత్నించిన నిందితుడు

హైదరాబాద్‌ సిటీ/కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆరో తరగతి బాలిక సహస్ర (12) దారుణ హత్య మిస్టరీ వీడింది. పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లోని పదో తరగతి బాలుడే ఆమెను హత్య చేసినట్టు తేలింది. చోరీ కోసం ఇంట్లోకి చొరబడిన ఆ బాలుడిని సహస్ర గుర్తించి అడ్డుకోవడంతో.. విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆమెను చంపేసినట్టు తెలిసింది. ఎలాంటి సాంకేతిక ఆధారాలూ లభించక తలపట్టుకున్న పోలీసులు.. పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి మామూలుగా చెప్పిన ఒక అంశం ఆధారంగా పరిశీలన జరిపి హత్య మిస్టరీని ఛేదించారు.


ఏం జరిగింది?

ఐదేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి వలస వచ్చిన కృష్ణ, రేణుక దంపతులు, వారి కుమార్తె సహస్ర, ఏడేళ్ల కుమారుడు కూకట్‌పల్లి దయార్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ పెంట్‌హౌజ్‌లో ఉంటున్నారు. కృష్ణ మెకానిక్‌గా, రేణుక ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. సహస్ర బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయలో ఆరో తరగతి, కుమారుడు ఇంటి సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కేంద్రీయ విద్యాలయలో స్పోర్ట్స్‌ మీట్‌ నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో సహస్ర ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 18న ఉదయం కుమారుడిని స్కూల్‌కు పంపిన తల్లిదండ్రులు తమ విధులకు వెళ్లిపోయారు. స్కూలుకు వెళ్లి తమ్ముడికి లంచ్‌ బాక్స్‌ ఇవ్వాలని చెప్పారు. అయితే ఉదయం 10:30 గంటల సమయంలో పక్క అపార్ట్‌మెంట్లోని బాలుడు గోడదూకి సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్లోకి వచ్చాడు. పెంట్‌హౌజ్‌లో ఎవరూ లేరనుకుని చోరీకి ప్రయత్నించాడు. కానీ ఇంట్లోనే ఉన్న సహస్ర అతడిని గమనించి అడ్డుకుంది. ఆందోళన చెందిన బాలుడు.. సహస్ర ఈ విషయాన్ని అందరికీ చెబుతుందనే భయంతో ఆమె నోరు నొక్కి, తన వెంట తీసుకెళ్లిన కత్తితో కడుపులో, గొంతుపై ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. తర్వాత గోడదూకి తమ అపార్ట్‌మెంట్లోకి పారిపోయాడు. మరోవైపు తన కుమారుడికి లంచ్‌ బాక్స్‌ రాలేదని మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణకు స్కూల్‌ నుంచి ఫోన్‌ రావడంతో.. వెంటనే ఇంటికి వెళ్లారు. అప్పటికే సహస్ర రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది.


చిన్న క్లూ ఆధారంగా ముందుకువెళ్లి..

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలన చేయించారు. హత్య ఉదయం 10-10.30 గంటల మధ్య జరిగినట్టు ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. బయటివాళ్లు వచ్చిన ఆనవాళ్లేవీ లేవు. అదే అపార్ట్‌మెంట్‌లోని వారిని, చుట్టుపక్కల వారిని విచారించినా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఘటన జరిగిన రోజున వర్షం పడటంతో జాగిలాలు వాసన పసిగట్టలేకపోయాయని తెలిసింది. అయితే సహస్ర హత్య జరిగిన రోజు చుట్టుపక్కల వారిని పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో.. నిందితుడైన బాలుడు సుమారు 10:30 సమయంలో డాడీ, డాడీ అంటూ సహస్ర పెద్దగా అరవడం వినిపించిందని చెప్పినట్టు సమాచారం. ఆ బాలుడు తరచూ వచ్చి పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారన్నది గమనిస్తుండటాన్ని గుర్తించినట్టు తెలిసింది. ఇక ఆ బాలుడు, సహస్ర తమ్ముడు స్నేహితులని.. అప్పుడప్పుడూ గోడదూకి వారి ఇంటికి వెళ్లేవాడని పక్క అపార్ట్‌మెంట్లోని ఓ వ్యక్తి పేర్కొన్నట్టు సమాచారం. బాలిక హత్య జరిగినట్టు నిపుణులు చెప్పిన సమయం, సహస్ర అరిచిందంటూ బాలుడు చెప్పిన సమయం సరిపోలడంతో.. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసిన విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. దీనితో ఆ రోజు ఏం జరిగిందనేది తేల్చేందుకు పోలీసులు ఘటనా స్థలంలో నిందితుడైన బాలుడితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్టు సమాచారం.


ఇంట్లో గొడవలు.. డబ్బుల కోసం చోరీ యత్నం..

నిందితుడైన బాలుడికి తల్లిదండ్రులతోపాటు ఇద్దరు అక్కలు ఉన్నట్టు తెలిసింది. అతను, రెండో అక్క ఇద్దరూ 10వ తరగతి చదువుతున్నట్టు సమాచారం. తండ్రి మద్యానికి బానిస కావడంతో తల్లి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గొడవలు జరిగేవని.. ఆ వాతావరణంతో మానసికంగా ఒత్తిడికి లోనైన బాలుడు డబ్బు కోసం ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం. ఈ క్రమంలో కృష్ణ, రేణుక దంపతుల ఇంట్లో డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న నిందితుడు.. చోరీ కోసం ప్రణాళిక వేసుకుని, ఓ కాగితంపై రాసుకున్నట్టు తెలిసింది. ఆ కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఇంట్లోకి వెళ్లగానే ముందుగా తాళం పగలగొట్టాలి, తర్వాత ఇంట్లో ఉన్న డబ్బును తీసుకోవాలి. తర్వాత ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పైపు కట్‌ చేయాలి. గ్యాస్‌ లీక్‌ చేయాలి. బయటికి వచ్చి గడియపెట్టి వెళ్లిపోవాలి. గ్యాస్‌ మొత్తం లీకై అగ్నిప్రమాదం జరగాలి. దీంతో మిషన్‌ డన్‌’’ అని రాసుకున్నట్టు సమాచారం. కానీ బాలుడు చోరీకి వెళ్లిన సమయంలో సహస్ర గుర్తించడంతో ఆమెను హత్యచేసి పారిపోయినట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు

అందుకే యూరియా ఆలస్యమైంది

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 04:03 AM