Indian Messaging App: భారత మెసేజింగ్ యాప్ అర్రాటై జోరు..వాట్సాప్‌కు సవాల్
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:19 PM
భారత్ నుంచి వచ్చిన కొత్త మెసేజింగ్ యాప్ అర్రాటై (Arratai) దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా గుర్తింపు పొందుతోంది. ఇది వాట్సాప్ వంటి అంతర్జాతీయ పెద్ద యాప్‌లతో పోటీ పడుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతదేశంలో స్వదేశీ సాంకేతికత రంగంలో కొత్త సంచలనం సృష్టిస్తోంది అర్రాటై యాప్ (Indian Messaging App Arattai). జోహో అభివృద్ధి చేసిన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్, వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తుందని టెక్ వర్గాలు అంటున్నాయి. యాప్ స్టోర్‌లలో ఇది సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. స్వదేశీ టెక్ ఉత్పత్తిగా రూపొందిన అర్రాటై వేగంగా పాపులర్ అవుతోంది.
100 రెట్లు ట్రాఫిక్ పెరుగుదల
జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ప్రకారం, అర్రాటై యాప్‌లో వినియోగదారుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. కేవలం మూడు రోజుల్లో యాప్ ట్రాఫిక్ 100 రెట్లు పెరిగిందన్నారు. రోజుకు కొత్తగా సైన్ అప్ చేసే వినియోగదారుల సంఖ్య 3,000 నుంచి 3,50,000కు చేరుకుందని తెలిపారు. ఈ భారీ డిమాండ్‌ను తట్టుకునేందుకు జోహో బృందం తమ సర్వర్ సామర్థ్యాన్ని అత్యవసరంగా పెంచుతోందన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి ప్రకటించారు.
స్వదేశీ యాప్‌కు స్వాగతం
అర్రాటై ఒక స్వదేశీ యాప్ కావడం దీని విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సాంకేతికతను ప్రోత్సహించాలనే ఆలోచనతో రూపొందిన ఈ యాప్, స్థానిక అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా, సురక్షితమైన, వినియోగదారు ఫీచర్లతో అర్రాటై ఆకర్షిస్తోంది. ఇది కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. భారతీయ సంస్కృతి, స్థానిక భాషలు, డేటా గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది.
సీఈఓ నుంచి ప్రశంసలు
అర్రాటై విజయం గురించి పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ కూడా ప్రశంసలు కురిపించారు. అర్రాటై లాంచ్‌లో జోహోకు అభినందనలు తెలిపారు. ఇది నిజంగా అద్భుతమైన విజయమని ఆయన Xలో పోస్ట్ చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా తన బృందంతో కలిసి ఈ యాప్‌లో చేరారు. మేడ్ ఇన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి