Women’s WC 2025: విక్టరీ పరేడ్ ఎప్పుడంటే..?
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:31 AM
మహిళా ప్రపంచకప్ విజయం సందర్భంగా టీమిండియా విక్టరీ పరేడ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఐసీసీ సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ వన్డే ప్రపంచ కప్(Women’s WC 2025)లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ.. అందరి మదిలో ఒకటే ప్రశ్న. టీమిండియా విజయోత్సవ ర్యాలీ ఎప్పుడు..?
ఇంకా ప్లాన్ చేయలేదు..
టీమిండియా విజయోత్సవ ర్యాలీ(Team India victory parade) ఇప్పుడే జరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ(BCCI) సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా స్పందించారు. ‘ప్రస్తుతానికైతే విక్టరీ పరేడ్ లాంటిదేమీ ప్లాన్ చేయలేదు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దుబాయ్‌లో ఐసీసీ(ICC) సమావేశాలు జరగనున్నాయి. నేను ఆ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తున్నా. అక్కడికి చాలా మంది అధికారులు వస్తున్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత సీనియర్ అధికారులు కూడా భారత్‌కు తిరిగి వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని సైకియా వెల్లడించారు.
ఐసీసీ దృష్టికి తీసుకెళ్తాం..
ఆసియా కప్(Asia Cup) వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ గెలిచినా ట్రోఫీ ఇంకా దేశానికి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై కూడా బీసీసీఐ సెక్రటరీ సైకియా స్పందించారు. ‘మేం ఆసియా కప్ ట్రోఫీ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తాం. ట్రోఫీని గౌరవప్రదమైన మార్గంలో తిరిగి తెచ్చుకుంటామనే ఆశాభావంతో ముందుకు వెళ్తున్నాం’ అని ఆయన వివరించారు.
పహల్గాం ఉగ్రదాడి చేసిన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగడం.. భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి ఆసక్తి చూపకపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేసి టీమిండియా విజేతగా నిలిచింది. అయితే పాక్‌కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ నఖ్వీ నుంచి టీమిండియా ప్లేయర్లు కప్ అందుకునేందుకు నిరాకరించారు. నఖ్వీ కూడా మరొకరితో ట్రోఫీ, మెడళ్లను భారత్‌కు అందించే ప్రయత్నం చేయకుండా.. వాటిని తనతోపాటు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుంది.