Virat Kohli: విజయ్ హజారేకు కోహ్లీ ‘నో’.. చిక్కుల్లో పడ్డ బీసీసీఐ!
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:34 PM
అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ ఫార్మాట్లలో ఆడాలంటే ప్రతి ప్లేయర్ దేశవాళీల్లో ఆడాల్సిందేనని టీమిండియా హెడ్ కోచ్ సహా బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. 2027 ప్రపంచ కప్ వరకు రో-కో ఉండాలని అభిమానులు కోరుకుంటున్న నేపథ్యంలో.. బీసీసీఐ(BCCI) కూడా వారి భవిష్యత్తుపై పలు కీలక చర్చలు జరుపుతుంది. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి సంబంధించిన ఓ వార్త తీవ్ర చర్చకు దారి తీసింది.
అసలేమైందంటే..
దేశవాళీల్లో ఆడాలన్న వాదనకు విరాట్ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పటికే ముంబై తరఫున ఆడేందుకు అంగీకరించగా, కోహ్లీ మాత్రం స్పష్టంగా ‘నో’ చెప్పినట్టు సమాచారం. రోహిత్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి కూడా అందుబాటులో ఉన్నాడు. కోహ్లీ మాత్రం ‘అతి ప్రిపరేషన్ అవసరం లేదు’ అన్న భావనలో ఉన్నాడట.
ఎలా కుదురుతుంది?
కోహ్లీ దేశవాళీల్లో ఆడేందుకు ఇష్టంగా లేకపోవడంతో బీసీసీఐ అధికారులు అసౌకర్యంలో పడిపోయారు. ‘రోహిత్ ఆడుతుంటే, కోహ్లీకి మినహాయింపు ఎలా ఇవ్వగలం? మిగతా ఆటగాళ్లకు ఏం చెప్పాలి?’ అని బోర్డు వర్గాలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకే జట్టులో ఒకరికి ప్రత్యేక హోదా ఇవ్వడం సరైంది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరోవైపు దేశవాళీల్లో ఆడాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరినీ రంజీ ట్రోఫీకి పంపింది కూడా బీసీసీఐ ఒత్తిడి వల్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కోహ్లీ నిర్ణయంతో బీసీసీఐ చిక్కుల్లో పడినట్టే!
ఇవి కూడా చదవండి:
అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్
హార్దిక్ పునరాగమనం.. బరోడా ఘన విజయం