Share News

Vaibhav Suryavanshi: శతక్కొట్టిన వైభవ్‌ .. భారత్‌ ఘన విజయం

ABN , Publish Date - Nov 15 , 2025 | 07:49 AM

యంగ్ ప్లేయర్ సూర్యవంశీ వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్‌-ఎ ఏకంగా 148 పరుగుల తేడాతో గెలిచి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. 297 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Vaibhav Suryavanshi: శతక్కొట్టిన వైభవ్‌ .. భారత్‌ ఘన విజయం
Vaibhav Suryavanshi

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి విధ్వంసక ఇన్నింగ్స్‌లతో 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) క్రికెట్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ తర్వాత కూడా తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తాజాగా వైభవ్ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టీ20 (Asia Cup Rising Stars T20)టోర్నీలో యూఏఈపై చెలరేగాడు. అతడు ప్రత్యర్థి బౌలర్లను ఊచకొత కోశాడు. కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడంటే ఎంతంటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్‌-ఎ ఏకంగా 148 పరుగుల తేడాతో గెలిచి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌-ఎ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. 297 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (10) త్వరగా ఔటైనప్పటికీ.. రెండో వికెట్‌కు నమన్‌ ధీర్‌ (34)తో వైభవ్ 57 బంతుల్లోనే 163 పరుగులు జోడించాడు. 17 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన అతను.. 32 బంతులకే సెంచరీ పూర్తి చేశాడు. ఇక యూఏఈ మ్యాచ్ లో వైభవ్‌ ప్రదర్శన చూస్తే టీ20ల్లో తొలి డబుల్‌ సెంచరీ కూడా నమోదవుతుందేమో అని అంతా భావించారు.


కానీ 13వ ఓవర్లో అతను 144 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లోనే స్కోరు 200 దాటింది. వైభవ్‌ ఔటయ్యాక జితేశ్‌ శర్మ(Jitesh Sharma) (83; 32 బంతులు) చెలరేగి ఆడి స్కోరును 300కు చేరువ చేశాడు. యూఏఈ బౌలర్లలో ఫరాజుద్దీన్, జవాదుల్లా 4 ఓవర్లలో 64 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. అనంతరం భారత్ బౌలర్లు గుర్జన్‌ప్రీత్‌ (3/18), హర్ష్‌ దూబే (2/12)ల ధాటికి యూఏఈ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. యూఏఈ జట్టు(UAE cricket team) తరఫున షోయబ్‌ ఖాన్‌ (63) టాప్‌ స్కోరర్‌. సెంచరీ వీరుడు వైభవ్‌ సూర్యవంశీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఆదివారం నాటి తదుపరి మ్యాచ్‌లో భారత్‌- పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.


ఇవి కూడా చదవండి:

Indias Bowlers Dominated: బుమ్రా ధాటికి విలవిల

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2025 | 07:49 AM