Share News

Tilak Varma: హైదరాబాద్ టూ గ్లోబల్ వరకు.. తిలక్ వర్మ జైత్ర యాత్ర

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:27 PM

హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల తిలక్ వర్మ పేరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై తిలక్ చేసిన 69 పరుగులు, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే తిలక్ గతంలో ఆడిన టోర్నీలు ఏంటి, అతని ఫ్యామిలీ గురించి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Tilak Varma: హైదరాబాద్ టూ గ్లోబల్ వరకు.. తిలక్ వర్మ జైత్ర యాత్ర
Tilak Varma

హైదరాబాద్ గర్వపడే 22 ఏళ్ల తిలక్ వర్మ (Tilak Varma) ఇప్పుడు భారత క్రికెట్ ప్రపంచంలో సరికొత్త స్టార్ ఆటగాడిగా వెలుగులోకి వచ్చాడు. చిన్న వయస్సులోనే క్రికెట్ వైపు వచ్చిన యువ క్రికెటర్, ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో 69 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చింది. ఈ ప్రదర్శనతో అతను కేవలం యువ ఆటగాడు మాత్రమే కాదు. టీమ్ ఇండియాకు కొత్త ఆశాకిరణంగా మారాడు. దీంతోపాటు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ అతని బ్యాటింగ్ జట్టు విజయానికి కారణమైంది. క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును గట్టెక్కించాడు.


బాల్యంలో క్రికెట్ పట్ల అభిరుచి

తిలక్ వర్మకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ కోచింగ్ తీసుకోవడం అతని కుటుంబానికి సవాలుగా మారింది. ఆ సమయంలో అతని తొలి కోచ్ సలాం బయాశ్ అండగా నిలిచారు. క్రికెట్ పరికరాలు, ఆర్థిక సహాయం అందించి తిలక్‌ను ప్రోత్సహించారు. ఈ సహాయంతో 2018-19 సీజన్‌లో కేవలం 16 ఏళ్ల వయస్సులో హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తిలక్ అడుగుపెట్టాడు.

వరల్డ్‌కప్‌లో మెరుపు

2019లో తిలక్ భారత U-19 వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించాడు. ఆ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరినప్పటికీ, బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. 6 మ్యాచ్‌లలో 86 పరుగులు సాధించిన తిలక్, తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

ముస్తాక్ అలీ ట్రోఫీలో హవా

2021-22 ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున 7 ఇన్నింగ్స్‌లలో 215 పరుగులు, 147.26 స్ట్రైక్ రేట్‌తో తిలక్ అదరగొట్టాడు. ఈ ప్రదర్శన అతని టీ20 సామర్థ్యాన్ని నిరూపించింది.


ఐపీఎల్లో ఎంట్రీ

తిలక్ ప్రతిభ ఐపీఎల్‌లోనూ వెలుగులోకి వచ్చింది. 2022లో ముంబై ఇండియన్స్ అతన్ని 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. డెబ్యూ సీజన్‌లో 397 పరుగులు, 2023లో 343 పరుగులతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

జాతీయ జట్టులో అరంగేట్రం

2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ప్రదర్శన అతని సామర్థ్యాన్ని చాటింది.


ఆసియా కప్ ఫైనల్లో సంచలనం

ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై తిలక్ వర్మ 69 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ సంయమనం, దూకుడు కలగలిపిన అతని ఆటతీరు అభిమానులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనతో అతను భారత జట్టులో భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిలక్‌ను అన్ని ఫార్మాట్లలో భవిష్యత్ స్టార్‌గా అభివర్ణించారు. తిలక్ 19 ఏళ్ల వయస్సులోనే రోహిత్ ఈ ప్రశంసలు కురిపించడం అతని ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.

సాదాసీదా నేపథ్యం

హైదరాబాద్‌లోని సామాన్య కుటుంబంలో తిలక్ జన్మించాడు. అతని తండ్రి నంబూరి నాగరాజు (ఎలక్ట్రిషియన్), తల్లి గాయత్రి దేవి (గృహిణి) సహకారంతో తన కలలను సాకారం చేసుకున్నాడు. తిలక్ శరీరంపై శివుడు, గణపతి, ఓం నమః శివాయా వంటి టాటూలు అతని ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి. ఈ టాటూలు అతని విశ్వాసాన్ని తెలియజేస్తాయి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 05:43 PM