ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2025 రేసులో ముగ్గురు ఇండియన్స్
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:05 PM
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.
ప్రతిష్టాత్మక ఐసీసీ సెప్టెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు (ICC Player of the Month September 2025) ముగ్గురు భారత క్రికెటర్లు నామినేట్ అయ్యారు. పురుషుల విభాగంలో అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పోటీలో ఉంది. వీరితో పాటు జింబాబ్వే ఆటగాడు బ్రియన్ బెన్నెట్, పాకిస్తాన్ నుంచి సిద్రా అమీన్, దక్షిణాఫ్రికా నుంచి టాజ్‌మిన్ బ్రిట్స్‌లు షార్ట్‌లిస్ట్ అయ్యారు.
అభిషేక్ శర్మ
సెప్టెంబర్ నెలలో అభిమానుల దృష్టిని ఆకర్షించిన వారిలో స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ ఉన్నాడు. యుఏఈలో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా మెరిసిన అభిషేక్, టోర్నీ మొత్తంలో 314 పరుగులు చేశాడు. అతని సగటు 44.85 కాగా, స్ట్రైక్ రేట్ అద్భుతంగా 200 ఉంది. ఈ టోర్నమెంట్‌లో అతని దూకుడైన బ్యాటింగ్ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచింది. సూపర్ ఫోర్స్ దశ ముగిసే సమయానికి అతను ఐసీసీ పురుషుల T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు 931 సాధించాడు.
కుల్దీప్ యాదవ్
భారత స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ కూడా ఆసియా కప్‌లో తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థుల్ని గజగజలాడించాడు. మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. ఫైనల్లో పాకిస్తాన్‌పై 4/30, లీగ్ మ్యాచ్‌లో యుఏఈపై 4 వికెట్లతో చెలరేగాడు. 9.29 సగటు, 6.27 ఎకానమీతో బౌలింగ్ చేసి టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
మహిళల విభాగంలో స్మృతి మంధాన
మహిళల విభాగంలో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆసీస్‌తో జరిగిన ODI సిరీస్‌లో అద్భుతంగా ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి, సగటున 77, స్ట్రైక్ రేట్ 135.68తో చెలరేగింది. 58, 117, 125 వంటి స్కోర్లు నమోదు చేయడంతో పాటు, మూడో వన్డేలో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి, ఇండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచింది.
జింబాబ్వే పవర్ హిట్టర్
జింబాబ్వే యువ ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ టీ20లలో సంచలన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులోకి వచ్చాడు. 21 ఏళ్ల వయస్సులోనే 9 టీ20 మ్యాచ్‌ల్లో 497 పరుగులు చేసి సగటున 55.22, స్ట్రైక్ రేట్ 165.66తో ఉన్నాడు. శ్రీలంక, నామిబియాలపై టీ20 సిరీసులో టాప్ స్కోర్ చేశాడు. ఐసీసీ వోటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఇప్పుడు తమ ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అభిమానులు తమ ఓటు వేయవచ్చు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈపీఎఫ్ఓ నుంచి శుభవార్త.. పెన్షన్ పెంపు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి