EPFO Pension: ఈపీఎఫ్ఓ నుంచి శుభవార్త.. పెన్షన్ పెంపు, కొత్త సంస్కరణల అమలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:18 PM
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి ఒక శుభవార్త రానుంది. గత 11 ఏళ్లుగా ఎటువంటి పెంపు లేని పెన్షనర్లకు ఇప్పుడు ఉపశమనం దక్కే ఛాన్సుంది. ఈ అంశంపై మరో మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త అందించనుంది. గత 11 సంవత్సరాలుగా మార్పు లేకుండా ఉన్న కనీస నెలవారీ పెన్షన్‌ను పెంచేందుకు సంస్థ చర్చలు జరుపుతోంది. అక్టోబర్ 10–11 తేదీలలో బెంగళూరులో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పెన్షన్ పెంపుతోపాటు సేవలను డిజిటలీకరణ చేసే EPFO 3.0 విధానం, పరిపాలనా సంస్కరణలు కూడా ఈ చర్చలో ఉంటాయి.
ఎంత, ఎప్పుడు?
ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద కనీస నెలవారీ పెన్షన్ రూ. 1,000గా ఉంది. 2014 నుంచి ఈ మొత్తంలో ఎటువంటి సవరణ జరగలేదు. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో, ద్రవ్యోల్బణం పెన్షనర్ల జీవనాన్ని మరింత కష్టతరం చేస్తోంది. ఈ కారణంగా ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సంఘాలు కనీస పెన్షన్‌ను రూ. 7,500కి పెంచాలని కోరుతున్నాయి.
రిటైర్మెంట్ తర్వాత
ఈ క్రమంలో నివేదికల ప్రకారం EPFO రూ. 2,500 వరకు పెన్షన్‌ను పెంచాలని చూస్తున్నట్లు తెలిసింది. ఈ పెంపు బోర్డు సభ్యుల ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా తుది ఆమోదం ఇవ్వాలి. పెన్షన్ పెంచడం వల్ల EPS-95 స్కీమ్‌లోని దాదాపు 70 లక్షల మందికి ఊరట లభించనుంది. ఈ స్కీమ్ కింద, ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని EPFOకి చెల్లిస్తారు. ఇది రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్‌గా అందుతుంది.
EPFO 3.0 డిజిటల్ మోడ్
పెన్షన్ పెంపుతో పాటు, EPFO తన సేవలను పూర్తిగా డిజిటల్, కాగిత రహితంగా మార్చేందుకు EPFO 3.0ని ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించే లక్ష్యంతో అనేక సేవలను పరిచయం చేయనున్నారు.
సభ్యులు ATMల ద్వారా తమ PF మొత్తాన్ని నేరుగా ఉపసంహరించుకునే సౌకర్యం
UPI ద్వారా త్వరితగతిన PF ఉపసంహరణ చేసుకునే అవకాశం
క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడం ద్వారా సభ్యులకు సమయం ఆదా కానుంది
డెత్ క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో సులభంగా ప్రాసెస్ చేసుకునే అవకాశం
సభ్యుల డేటాను సమగ్రంగా నిర్వహించడం ద్వారా సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నారు. ఈ డిజిటల్ సంస్కరణలు EPFO సేవలను సులభతరం చేయడమే కాక, సభ్యులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడంలో సహాయపడతాయి.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి