Australia Tour-Shubhman Gill: ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా గిల్
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:03 PM
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్‌లో రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇకపై వన్డే మ్యాచుల్లో టీమిండియాను శుభ్‌మన్ గిల్ ముందుండి నడిపించనున్నాడు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. శనివారం అజిత్ అగార్కర్ సారథ్యంలో సమావేశమైన సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ కూడా టీమిండియా తరఫున ఆడనున్నారు (Australia tour Shubhman Team India Captain).
ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా అక్టోబర్ 19 నుంచి 25 తేదీల మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ తరువాత అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకూ ఐదు మ్యాచుల టీ20 టోర్నీ జరగనుంది. ఇక శుభ్‌మన్ గిల్ ఇటీవలే టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఇంగ్లండ్‌తో ఆండర్సన్-టెండుల్కర్ టెస్టు సరీస్‌ను డ్రాగా ముగించుకుని తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్నాడు. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో టీమిండియాకు సూర్యకుమార్ నేతృత్వం వహించగా గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో జట్టుకు శుభ్‌మన్ గిల్ నేతృత్వం వహిస్తాడన్న అంచనాలూ ఉన్నాయి (India Australia One day Tournament).
వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక అవుతాడని అంతా భావించారు. అయితే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియాతో సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించారు. చివరకు శనివారం సమావేశంలో శుభ్‌మన్ గిల్‌ను వన్డే సారథిగా ఎంపిక చేశారు. ఇక ఈ సిరీస్‌ను రిషభ్ పంత్ మిస్సయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంగ్లండ్ టూర్‌లో గాయపడ్డ నాటి నుంచీ అతడు జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు సునాయాస విజయం
పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి