Shardul Thakur: వరల్డ్ కప్ 2027.. ఆ స్థానం నాదే: శార్దూల్ ఠాకూర్
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:03 PM
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో రాణిస్తున్న శార్దూర్ ఠాకూర్ టీమిండియాలోకి తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ప్రపంచ కప్‌లో తాను కచ్చితంగా ఆడతానని వ్యాఖ్యానించాడు. యువ ప్లేయర్ హర్షిత్ రాణా పోషిస్తోన్న రోల్ తనదేనని తెలిపాడు.
మొన్నటి వరకు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత సెలక్షన్ కమిటీ తనను పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశతో ఉన్నాడు. ఈ జాబితాలోకి ఇప్పుడు మరో ఆటగాడు చేరాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో రాణిస్తున్న శార్దూర్ ఠాకూర్(Shardul Thakur) టీమిండియాలోకి తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ప్రపంచ కప్(2027 World Cup)లో తాను కచ్చితంగా ఆడతానని వ్యాఖ్యానించాడు.
‘నిరంతరం మ్యాచ్‌లు ఆడుతూ.. మెరుగైన ప్రదర్శన చేయడమే నా పని. మళ్లీ జాతీయ జట్టులోకి రావడమే నా లక్ష్యం. అందుకోసం ఏం చేయాలనేది నాకు తెలుసు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తేనే జట్టు ఎంపిక సమయంలో నన్ను పరిగణనలోకి తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ జాతీయ జట్టుకు ఆడాలని కోరుకుంటారు. దానికి నేనేమీ మినహాయింపు కాదు. కచ్చితంగా భారత జట్టులోకి పునరాగమనం చేస్తా’ అని శార్దూల్ తెలిపాడు.
దేనికైనా రెడీ..!
‘వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనుంది. అక్కడ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లకు అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు నా దృష్టి కూడా అక్కడే పెట్టా. నా అవసరం ఉందని భారత జట్టు భావించినప్పుడు లేదా నేను సెలక్ట్ అయినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా. నా సన్నద్ధత ఎలా ఉంటుందంటే.. రేపే మ్యాచ్ ఆడాలన్నా సరే ఐ యామ్ రెడీ. ముఖ్యంగా యువ ప్లేయర్ హర్షిత్ రాణా పోషిస్తూన్న రోల్ నాదే’ అని శార్దూల్ తెలిపాడు. ఇటీవల జరిగిన ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో హర్షిత్ రాణా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారీ షాట్లే ఆడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో ఓ మాదిరి స్కోరు చేయడం వెనక కూడా హర్షిత్ పాత్ర కూడా ఉంది.
మరోవైపు శార్దూల్ ఠాకూర్ ఇప్పటి వరకు కేవలం 47 వన్డేలు, 25 టీ20లు, 13 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచ కప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో చోటు కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. అడపాదడపా టెస్టుల్లోకి వచ్చినా.. పెద్దగా ప్రభావం చూపలేదు.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్