Ruturaj Gaikwad Century: రుతురాజ్ అరుదైన ఘనత.. ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు
ABN , Publish Date - Dec 04 , 2025 | 10:12 AM
టీమిండియా యంగ్ ప్లేయర్ రుతరాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. రాయ్ పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ శతకంతో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బుధవారం రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 358 పరుగుల భారీ స్కోర్ ప్రొటీస్ జట్టు ముందు ఉంచినా.. ఉఫ్ నా ఊదేసింది. నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad Century), విరాట్ కోహ్లీలు చేసిన శతకాలు వృథా అయ్యాయి. ఎడెన్ మార్‌క్రమ్ అద్భుత సెంచరీ(105)తో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అంతేకాక గైక్వాడ్ సృష్టించిన రికార్డు ఎవరు బ్రేక్ చేయలేనిది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఎనిమిది పరుగులే చేసి ఔటయ్యాడు. సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో యజమాన్యం రుతురాజ్‌పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే, మేనేజ్‌మెంట్ గైక్వాడ్‌కు మరో అవకాశం ఇచ్చింది. రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని తుది జట్టులోకి ఎంపిక చేసింది.
చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు:
రెండో వన్డేతో తనకు వచ్చిన మరో అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad ) బాగా ఒడిసిపట్టుకున్నాడు. ప్రారంభం నుంచి 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు. ప్రొటీస్ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ(First International Century in Raipur) సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు.
కాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 2023లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. ఆ వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు. అలానే ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే సెంచరీ చేసిన రుతురాజ్.. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
Kohli ODI century: సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా..
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ