Share News

South Africa Thrash India: 358 చాల్లేదు

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:12 AM

విరాట్‌ కోహ్లీ (93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్‌ గైక్వాడ్‌ (83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) శతకాలతో భారత్‌ భారీ స్కోరు చేసినా.. బౌలర్లు, ఫీల్డింగ్‌ వైఫల్యంతో కొండంత స్కోరును...

South Africa Thrash India: 358 చాల్లేదు

కోహ్లీ, గైక్వాడ్‌ శతకాలు వృథా

రెండో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

మార్‌క్రమ్‌ సెంచరీ

1-1తో సిరీస్‌ సమం

రాయ్‌పూర్‌: విరాట్‌ కోహ్లీ (93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్‌ గైక్వాడ్‌ (83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) శతకాలతో భారత్‌ భారీ స్కోరు చేసినా.. బౌలర్లు, ఫీల్డింగ్‌ వైఫల్యంతో కొండంత స్కోరును కాపాడుకోలేకపోయింది. మార్‌క్రమ్‌ (98 బంతు ల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110)తోపాటు మిగతా బ్యాటర్లు రాణించడంతో.. బుధవారం హోరాహోరీగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్లతో భారత్‌ను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 358/5 స్కోరు చేసింది. రాహుల్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్‌) రాణించాడు. యాన్సెన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలిచింది. బ్రిట్స్‌కే (68), బ్రేవిస్‌ (54) గెలుపులో కీలకపాత్ర పోషించారు. అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ చెరో 2 వికెట్లు తీశారు. మార్‌క్రమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఆఖరిదైన మూడో వన్డే శనివారం విశాఖపట్నంలో జరగనుంది.

రాణించిన బ్యాటర్లు..: భారీ ఛేదనలో ఓపెనర్‌ డికాక్‌ (8)ను అర్ష్‌దీప్‌ స్వల్ప స్కోరుకే వెనక్కిపంపినా.. మార్‌క్రమ్‌తోపాటు మిగతా బ్యాటర్లు కలిసికట్టుగా ఆడి సౌతాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించారు. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్‌క్రమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్‌ చేజార్చడంతో.. భారత్‌ భారీమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కెప్టెన్‌ బవుమా (46)తో కలసి రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్న మార్‌క్రమ్‌.. బ్రిట్స్‌కేతో కలసి మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపుబాటలో నిలిపాడు. అయితే, సెంచరీ పూర్తి చేసుకొన్న మార్‌క్రమ్‌ను.. 30వ ఓవర్‌లో రాణా స్లో బంతితో బోల్తా కొట్టించడంతో.. భారత్‌ ఊపిరి పీల్చుకొంది. అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 20 ఓవర్లలో ఇంకా 162 రన్స్‌ కావాలి. ఈ దశలో బ్రిట్స్‌కే, బ్రేవిస్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో బ్రిట్స్‌కే హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. 40వ ఓవర్‌లో రాణా బౌలింగ్‌లో బ్రేవిస్‌ రెండు వరుస సిక్స్‌లతో గేర్‌ మార్చాడు. దీంతో లక్ష్యం చివరి 60 బంతుల్లో 77 పరుగులకు దిగివచ్చింది. అయితే, సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న బ్రేవి్‌సను కుల్దీప్‌ క్యాచవుట్‌ చేశాడు. బ్రిట్స్‌కేను ప్రసిద్ధ్‌.. యాన్సెన్‌ (2)ను అర్ష్‌దీప్‌ వెనక్కిపంపడంతో కొంత ఉత్కంఠ రేగినా.. జోర్జి (17 రిటైర్డ్‌ హర్ట్‌), బాష్‌ (29 నాటౌట్‌), కేశవ్‌ (10 నాటౌట్‌) 4 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు.


డెత్‌లో డీలా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (22), రోహిత్‌ (14) దూకుడైన ఆరంభాన్నిచ్చారు. ఐదో ఓవర్‌లో బర్గర్‌ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన రోహిత్‌.. అదే ఓవర్‌లో అవుటవగా.. జైస్వాల్‌ మరోసారి యాన్సెన్‌ బౌన్సర్‌కు బోల్తాపడ్డాడు. అయితే, కోహ్లీ, గైక్వాడ్‌ మూడో వికెట్‌కు 195 పరుగులు జోడించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. కోహ్లీ, గైక్వాడ్‌ చక్కని సమన్వయంతో వికెట్ల మధ్య పరిగెత్తడంతోపాటు వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 96/2తో నిలిచింది. గత మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన గైక్వాడ్‌ ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. ఈ క్రమంలో 24వ ఓవర్‌లో మార్‌క్రమ్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాతి ఓవర్‌లో కోహ్లీ కూడా అతడిని అందుకొన్నాడు. ఆత్మవిశ్వాసం పెరగడంతో రుతురాజ్‌ ఒక్కసారిగా గేర్‌మార్చాడు. 28వ ఓవర్‌లో కేశవ్‌ బౌలింగ్‌లో 4,6,4తో 16 పరుగులు పిండుకొన్న గైక్వాడ్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో గైక్వాడ్‌ కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తి చేసుకొన్నాడు. అయితే, యాన్సెన్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ మరో భారీ షాట్‌ ఆడే క్రమంలో జోర్జికి చిక్కాడు. మరోవైపు వరుసగా రెండో సెంచరీ బాదిన కోహ్లీని.. ఎన్‌గిడి అవుట్‌ చేయడంతో భారత్‌ స్కోరు వేగం మందగించింది. వాషింగ్టన్‌ సుందర్‌ (1) రనౌట్‌ కాగా.. డెత్‌ ఓవర్లలో రాహుల్‌, జడేజా (24 నాటౌట్‌) ఆశించినంత దూకుడుగా ఆడలేకపోయారు. కానీ, చివరి ఓవర్‌లో చెలరేగిన రాహుల్‌ 18 పరుగులు రాబట్టడంతో.. టీమ్‌ స్కోరు 350 మార్క్‌ దాటింది.


స్కోరుబోర్డు

భారత్‌: జైస్వాల్‌ (సి) బాష్‌ (బి) యాన్సెన్‌ 22, రోహిత్‌ (సి) డికాక్‌ (బి) బర్గర్‌ 14, కోహ్లీ (సి) మార్‌క్రమ్‌ (బి) ఎన్‌గిడి 102, రుతురాజ్‌ (సి) జోర్జి (బి) యాన్సెన్‌ 105, రాహుల్‌ (నాటౌట్‌) 66, వాషింగ్టన్‌ (రనౌట్‌) 1, జడేజా (నాటౌట్‌) 24, ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 50 ఓవర్లలో 358/5; వికెట్ల పతనం: 1-40, 2-62, 3-257, 4-284, 5-289; బౌలింగ్‌: బర్గర్‌ 6.1-0-43-1, ఎన్‌గిడి 10-1-51-1, యాన్సెన్‌ 10-0-63-2, కేశవ్‌ 10-0-70-0, బాష్‌ 8-0-79-0, మార్‌క్రమ్‌ 5.5-0-48-0.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (సి) రుతురాజ్‌ (బి) హర్షిత్‌ 110, డికాక్‌ (సి) వాషింగ్టన్‌ (బి) అర్ష్‌దీప్‌ 8, బవుమా (సి) హర్షిత్‌ (బి) ప్రసిద్ధ్‌ 46, బ్రిట్స్‌కే (ఎల్బీ) ప్రసిద్ధ్‌ 68, బ్రేవిస్‌ (సి) జైస్వాల్‌ (బి) కుల్దీప్‌ 54, జోర్జి (రిటైర్డ్‌ హర్ట్‌) 17, యాన్సెన్‌ (సి) రుతురాజ్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, బాష్‌ (నాటౌట్‌) 29, కేశవ్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 49.2 ఓవర్లలో 362/6; వికెట్ల పతనం: 1-26, 2-127, 3-197, 4-289, 5-317, 6-322, 6-332 (రిటైర్డ్‌ హర్ట్‌); బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 10-0-54-2, హర్షిత్‌ 10-0-70-1, ప్రసిద్ధ్‌ 8.2-0-85-2, వాషింగ్టన్‌ 4-0-28-0, జడేజా 7-0-41-0, కుల్దీప్‌ యాదవ్‌ 10-0-78-1.

7

వన్డేల్లో దక్షిణాఫ్రికాపై విరాట్‌ కొట్టిన సెంచరీలు.

53

వన్డేల్లో విరాట్‌ సెంచరీల సంఖ్య. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్ల (టెస్టుల్లో 30, టీ20ల్లో 1)లో కలిపి 84 శతకాలు ఉన్నాయి.

2

350కిపైగా పరుగులు చేసినా టీమిండియా మ్యాచ్‌ కోల్పోవడం ఇది రెండోసారి. 2019లో ఆస్ట్రేలియాతో వన్డేలో భారత్‌ 358/9 స్కోరు చేసినా.. ఓడింది.

20

వన్డేల్లో భారత్‌ వరుసగా టాస్‌ ఓడడం ఇది 20వసారి.

11

వన్డే క్రికెట్‌లో వరుస సెంచరీలు చేయడం కోహ్లీకిది పదకొండోసారి. ఈ జాబితాలో డివిల్లీర్స్‌ (6), రోహిత్‌ (4), బాబర్‌ ఆజమ్‌ (4), వార్నర్‌ (4), సయీద్‌ అన్వర్‌ (4) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 04 , 2025 | 06:12 AM