ICC Sidra Ameen: భారత్ మ్యాచ్‌లో ఓవర్ యాక్షన్.. పాక్ ప్లేయర్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:52 PM
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం కొలంబోలో ఇండియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ ఓపెనర్ సిద్రా అమీన్ చేసిన అతి ప్రవర్తన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆమె ప్రవర్తన లెవెల్ 1 నేరంగా గుర్తించబడింది.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబోలో జరిగిన ఐసీసీ (ICC) మహిళల వన్డే వరల్డ్ కప్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ (Sidra Ameen) ఓ వివాదంలో చిక్కుకుంది. ఆటలో ఓ సందర్భంలో ఆమె ప్రవర్తనను అసభ్యంగా భావించిన ఐసీసీ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కారణంగా సిద్రా అమీన్‌కు అధికారికంగా రిప్రిమాండ్ జారీ చేస్తూ ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించింది.
ఐసీసీ ప్రకారం, ఇది లెవెల్ 1 నేరంగా పరిగణించబడుతుంది. గత 24 నెలల్లో ఆమెకు ఇదే మొదటి తప్పు కావడంతో గట్టిగా హెచ్చరించింది. సిద్రా అమీన్ చూపిన తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగింది?
మ్యాచ్‌లో భాగంగా 40వ ఓవర్‌లో సిద్రా అమీన్ ఔట్ అయిన తర్వాత, ఆమె తన నిరాశను చూపించే క్రమంలో బ్యాట్‌ను గట్టిగా పిచ్‌పై కొట్టింది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించినట్టైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ సామగ్రి, దుస్తులు, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్ లేదా ఫిక్స్‌చర్స్‌ను దుర్వినియోగం చేయకూడదు.
కానీ సిద్రా తన తప్పును ఒప్పుకుని, మ్యాచ్ రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ ప్రతిపాదించిన శిక్షను అంగీకరించడంతో ఈ విషయంలో ఎలాంటి హియరింగ్ అవసరం లేకుండా సమస్య పరిష్కారమైంది. ఈ విషయంపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు లారెన్ అగెన్‌బాగ్, నిమలీ పెరెరా, థర్డ్ అంపైర్ కెరిన్ క్లాస్టే, ఫోర్త్ అంపైర్ కిమ్ కాటన్ ఫిర్యాదు చేశారు. వారు సిద్రా అమీన్ చర్యను గమనించి, దానిని ఐసీసీ నిబంధనల ఉల్లంఘనగా గుర్తించారు.
శిక్ష వివరాలు
లెవెల్ 1 నేరాలకు ఐసీసీ నిబంధనల ప్రకారం కనీస శిక్షగా అధికారిక రిప్రిమాండ్, గరిష్టంగా ఆటగాడి మ్యాచ్ ఫీలో 50 శాతం జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించవచ్చు. సిద్రా విషయంలో ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్‌తోపాటు అధికారిక వార్నింగ్ జారీ చేశారు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు భారత్‌తో ఓడిపోయింది.
భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. సిద్రా అమీన్ 106 బంతుల్లో 81 పరుగులతో పాకిస్తాన్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. కానీ చివరకు మ్యాచ్ ఓడిపోక తప్పలేదు. ఈ ఓటమితో పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి, రెండింటిలోనూ ఓడిపోయింది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి