DGCA: పండుగల సమయంలో పెరుగుతున్న విమాన ఛార్జీలకు బ్రేక్ పడనుందా.. రంగంలోకి డీజీసీఏ
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:07 PM
దసరా పూర్తైంది. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసం, క్రిస్మస్ పండుగల సీజన్ వచ్చేస్తుంది. పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమాన టికెట్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది.
దసరా ముగిసింది. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసం, క్రిస్మస్ వంటి పండుగల హంగామా మొదలవుతోంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉండటం సహజం. కానీ పండుగల సీజన్ వచ్చినప్పుడల్లా విమాన టికెట్ల ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. అధిక ధరలతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ (DGCA) రంగంలోకి దిగింది.
పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని, టికెట్ ధరలను నియంత్రించాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ డీజీసీఏకి ఆదేశించింది. ఎయిర్‌లైన్స్‌తో చర్చించి, అవసరమైన చోట ఎక్కువ ఫ్లైట్లను నడిపించాలని సూచనలు ఇచ్చింది. దీంతో ప్రయాణికులు ఈ సీజన్‌లో పెరిగే టికెట్ ధరల నుంచి ఊపశమనం పొందనున్నారు.
DGCA ఏం చేస్తోంది?
ధరల పెరుగుదలను అదుపు చేయడానికి DGCA ఎయిర్‌లైన్స్‌తో కలిసి పని చేస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) ఆదేశాల మేరకు, పండుగల సీజన్‌లో అదనపు విమానాలను నడపమని ఎయిర్‌లైన్స్‌కు సూచించింది. దీంతో ప్రయాణికులకు సీట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ధరలు కూడా అదుపులోకి వస్తాయి.
ఈ క్రమంలో ఎయిర్ ఇండియా & ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 20 రూట్లలో 486 అదనపు విమానాలు నడపనున్నాయి
స్పైస్‌జెట్: 38 రూట్లలో 546 అదనపు విమానాలు ఏర్పాటు చేస్తోంది
ఇండిగో: 42 రూట్లలో 730 అదనపు విమానాలను నడుపుతోంది
గతంలో ప్రయాగ్‌రాజ్ మహాకుంభ సమయంలో 81 అదనపు విమానాలను నడిపించి, ధరలను కొంత అదుపులోకి తెచ్చారు. ఈ సారి కూడా DGCA చర్యలతో ప్రయాణికులకు ఊరట కల్పించాలని చూస్తోంది.
ఈ దీపావళి ధరలు ఎలా ఉన్నాయి?
ఈ సంవత్సరం దీపావళి సీజన్‌లో టికెట్ ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 52% వరకూ పెరిగాయట. ఎందుకంటే, ట్రావెల్ డిమాండ్ బాగా పెరిగింది. సాధారణంగా పండుగ సీజన్‌లో కీలక రూట్లలో ధరలు 10-25% పెరుగుతాయి. కానీ ఈ సారి అది ఊహించనంతగా పెరిగింది. DGCA చర్యల వల్ల కొంత ఉపశమనం లభించనుంది. మీరు ఈ సీజన్‌లో ట్రావెల్ ప్లాన్ చేస్తున్నట్లైతే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం బెటర్. అదనపు విమానాల వల్ల సీట్లు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆలస్యం చేస్తే మాత్రం సీట్లు లభించే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి