COD Extra Charges: క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు రుసుము ఎందుకు.. వినియోగదారుల మంత్రిత్వ శాఖ దర్యాప్తు
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:38 PM
ప్రస్తుత రోజుల్లో అనేక మంది కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. కానీ క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆప్షన్ ఎంచుకుంటే అదనంగా ఛార్జీలు పడటం గురించి మీకు తెలుసా. దీని గురించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెలుపగా, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Department of Consumer Affairs) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడిపోయారు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ (COD) విషయంలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై అనేక మంది స్పందించగా, ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది.
COD ఛార్జీలను డార్క్ ప్యాటర్న్ గా పేర్కొంటూ, ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రవర్తన అని స్పష్టం చేసింది. దీనిపై విచారణ ప్రారంభమైందని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వినియోగదారుల హక్కులు అణిచివేయబడకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలిపింది.
డార్క్ ప్యాటర్న్ అంటే..
వెబ్‌సైట్లలో మనకు తెలియకుండా, గమనించకుండా ఫీజులు వేయడం లేదా మోసపూరితమైన డిజైన్‌లు రూపొందించి వినియోగదారులను తప్పుదోవ పట్టించడాన్ని డార్క్ ప్యాటర్న్ అంటారు. యూజర్లకు వారి అసలైన వాటిని నుంచి దూరం చేయడం, అకారణంగా అధిక ఛార్జీలు వసూలు చేయడం ఈ పద్ధతిలో భాగం. ఈ క్రమంలో ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీపై అదనపు ఛార్జీలను వసూలు చేయడం కూడా డార్క్ ప్యాటర్న్ అని నిపుణులు చెబుతున్నారు.
నెటిజన్ల కామెంట్స్
COD ఎంచుకున్నందుకు రూ.49 అదనంగా తీసుకున్నారని, పేమెంట్ హ్యాండ్లింగ్ పేరిట ఛార్జీలు వేశారని స్క్రీన్‌షాట్‌లు షేర్ చేస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేశారు. COD కూడా చెల్లుబాటు అయ్యే పేమెంట్ మోడ్. దీనికి అదనపు ఛార్జీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇది అనైతికమే కాక, వినియోగదారుడి స్వేచ్ఛను హరించడమేనని మరో వ్యక్తి పేర్కొన్నాడు. పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీ, ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అనే పేర్లతో కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఛార్జీలను వసూలు చేస్తున్నాయని పలువురు అంటున్నారు. ఇలాంటి ఛార్జీలపై వినియోగదారులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Department of Consumer Affairs) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది.
మనం ఏం చేయాలి?
మీరు కూడా COD ఎంపిక చేసుకుని అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తే దాని గురించి స్క్రీన్‌షాట్ తీసుకోండి. వినియోగదారుల వ్యవహారాల శాఖలో ఫిర్యాదు చేయండి (https://consumerhelpline.gov.in) దీంతోపాటు సోషల్ మీడియాలో షేర్ చేసి దీని గురించి ఇతరులకు తెలియజేయండి.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి