Arshdeep Singh: అర్ష్‌దీప్ అర్థం చేసుకున్నాడు: కోచ్ మోర్నీ
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:01 PM
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ కారణంగానే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టామని, అతడు ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20లకు మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో వందకు పైగా వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మూడో టీ20కి జట్టులోకి తీసుకున్నారు. అక్కడ అదరగొట్టిన అర్ష్‌దీప్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ విషయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. క్వీన్స్‌లాండ్ వేదికగా గురువారం(నవంబర్ 6) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోర్నీ మాట్లాడాడు.
‘అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) చాలా అనుభవం కలిగిన ఆటగాడు. మా కాంబినేషన్ గురించి అతడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. పవర్ ప్లే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అర్ష్‌దీప్‌ది. జట్టుకు కూడా అతడి విలువ ఏంటో మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మేం వివిధ కాంబినేషన్లను ప్రయత్నించాం. దీంతో అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ విషయం అతడు అర్థం చేసుకున్నాడు’ అని మోర్నీ(Morne Morkel) వ్యాఖ్యానించాడు.
అది అందరికీ సవాలే..
‘జట్టును ఎంపిక మేనేజ్‌మెంట్‌కు మాత్రమే కాదు ప్లేయర్లకు కూడా సవాలుతో కూడుకున్న విషయమే. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో భిన్న కూర్పులను ప్రయత్నిస్తున్నాం. దీంతో ఆటగాళ్లు తమకు అవకాశం రాలేదని నిరుత్సాహపడటం సహజమే. కానీ మేనేజ్‌మెంట్ వైపు ఆలోచన మరోలా ఉంటుంది. ఆటగాళ్లు ఇంకా శ్రమించేలా ప్రోత్సహిస్తాం. ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేలా సన్నద్ధం చేస్తాం. వచ్చే ప్రపంచ కప్‌లోగా చాలా తక్కువ మ్యాచులనే ఆడాల్సి ఉంటుంది. ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది పరీక్షించాం. వారి సత్తాపై మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ మ్యాచులను ఎలా గెలవాలనే దానిపైనే వర్కౌట్ చేస్తున్నాం’ అని మోర్నీ వెల్లడించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి