Share News

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే విరాట్!

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:20 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు నేడు. 27 వేల పరుగులు, 82 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన రన్ మెషీన్ ఇప్పటికీ తన జోరు తగ్గించలేదు.

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే విరాట్!
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే రికార్డులు సాగిలపడిపోతాయి. ప్రత్యర్థులు వణికిపోతారు. 1988 నవంబర్ 5న ఢిల్లీలో పుట్టాడు ‘చీకూ’. ఆ రోజే భారత క్రికెట్‌కు ఓ అద్భుతమైన అధ్యాయం మొదలైంది. 27,673 పరుగులు.. 82 సెంచరీలు, 144 హాఫ్ సెంచరీలు.. చెప్పుకూంటూ పోతే రోజులు చాలవు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా.. పాత్ర ఏదైనా ఆశయం ఒక్కటే. అగ్రెషన్ అతడి మరో పేరు. చిలిపితనం అతడి ముద్దు పేరు. నేడు(బుధవారం) విరాట్ 37వ పుట్టిన రోజు!


క్రికెట్‌ను శాసించిన రారాజు..

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఇప్పటికీ మైదానంలో అతడి పరుగుల దాహం తీరలేదు. టీమిండియా(Team India) తరఫున 123 టెస్టులు, 305 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో 30 సెంచరీలు సహా 9,230 పరుగులు చేశాడు. వన్డేల్లో కింగ్ సాధించిన పరుగులు 14,255. ఫార్మాట్ ఏదైనా కింగ్ బరిలోకి దిగాడంటే.. రికార్డులు సరెండర్ అవ్వాల్సిందే. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(50)చేసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన ఘనత అతడిది.


‘కింగ్’.. ఈ పేరెలా వచ్చిందంటే?

విరాట్.. టీమిండియా గెలుపు కోసం తపించే ఓ ఋషి. కింగ్(King Kohli) అనే పేరు అతడు పెట్టుకున్నదో.. అభిమానులు పెట్టిందో కాదు.. దీని వెనక ఓ కథ ఉంది. అదే ఓ చరిత్ర అయింది. 2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా.. మెల్‌బోర్న్‌కు చెందిన భారతీయ ఐటీ ప్రొఫెషనల్ కునాల్ గాంధీ అనే వ్యక్తి విరాట్‌కు ‘కింగ్ కోహ్లీ’ అని రాసిన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ‘నేను కోహ్లీ అని మాత్రమే రాయాలని అనుకోలేదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ‘కింగ్’అని రాశా. ఆ పదం నాకు సహజంగా అనిపించింది’ అని వెల్లడించాడు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ కాస్తా ‘కింగ్ కోహ్లీ’ అయ్యాడు.


18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..

ఆర్సీబీ.. ఐపీఎల్(IPL) ఆరంభం నుంచి లీగ్‌లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. తన చేతిలో ఐపీఎల్ కప్‌ను చూడాలన్న అభిమానుల కల 18 ఏళ్లకు తీరింది. అభిమానుల ఆశకు రూపమిస్తూ.. ఐపీఎల్‌ 2025లో బెంగళూరు కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడినా ట్రోఫీని అందుకోలేకపోయినా కోహ్లీ.. కెరీర్ చివరిలో సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి తన అభిలాషను నెరవేర్చుకున్నాడు.


ఇంకా ముగియలేదు!

టెస్టులు, టీ20లకు కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కానీ వన్డేల్లో కోహ్లీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాపై ఆడిన అద్భుతమైన నాక్.. తన పరుగుల దాహాన్ని అభిమానులకు గుర్తు చేసింది. ఇప్పుడు అతడు మైలురాళ్లకోసం కాకుండా, అర్ధవంతమైన ప్రయాణం కోసం ఆడుతున్నాడు. కొత్త తరాన్ని ప్రోత్సహించడం, భారత జట్టు కలలను సాకారం చేయడమే ప్రస్తుతం కోహ్లీ లక్ష్యం. అతడు బ్యాట్ ఎత్తితే.. అదో యుద్ధం. వికెట్ల మధ్యలో పరిగెత్తే అదే జీవిత మారథాన్! ‘హ్యాపీ బర్త్ డే కింగ్ కోహ్లీ’!


ఈ వార్తలు కూడా చదవండి:

రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

కలలు కనడం ఆపొద్దు: హర్మన్

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 12:12 PM