Harmanpreet Kaur: కలలు కనడం ఆపొద్దు: హర్మన్
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:05 PM
ప్రపంచ కప్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చింది. ‘కలలు కనడం ఆపొద్దు, కష్టపడితే అవి నిజమవుతాయి’ అని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకుంది. ఈ గెలుపులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా హర్మన్ యువతకు ఓ సలహా ఇచ్చింది. దాంతోపాటు తన బాల్యంలో క్రికెట్ బ్యాట్‌తో ఆడుకున్న రోజులను గుర్తు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ(BCCI) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
‘యువత కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు(Harmanpreet message). నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చేతిలో ఎప్పుడూ బ్యాట్ ఉండేది. అది మా నాన్న క్రికెట్ కిట్‌లోది. అది చాలా పెద్దగా ఉందని.. ఓ రోజు దాన్ని మా నాన్న చిన్నగా చెక్కి ఇచ్చాడు. మేం దాంతో ఆడుకునే వాళ్లం. టీవీల్లో క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడల్లా.. ముఖ్యంగా టీమిండియా(Team India) ఆడుతున్నప్పుడు నాకూ ఇలాంటి అవకాశం రావాలని కోరుకునే దాన్ని. నిజానికి ఆ సమయంలో నాకు మహిళల క్రికెట్ గురించి కూడా పెద్దగా తెలియదు’ అని హర్మన్ వివరించింది.
కలలు సాకారం చేసుకున్నా..
‘టీమిండియాకు ఆడాలని నాకు కలగా ఉండేది. నేను అనుకున్నట్లుగానే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నా. అలాగే ప్రపంచ కప్ గెలవాలని కల కన్నాను. అది కూడా సాకారం అయింది. ప్రస్తుతం మేం ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచాం. అందుకే యువత కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు. కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి. కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్న మా ఆశయం ఈ నాటికి నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు’ అని హర్మన్ తెలిపింది.
చాలా బాధపడ్డాం..
2017 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి గురించి హర్మన్ తన అనుభవాలను పంచుకుంది. ‘2017 ప్రపంచ కప్ ఫైనల్‌లో 9 పరుగులతో ఓడిపోయాం. అసలు అది ఎలా జరిగిందో కూడా మాకు అర్థం కాలేదు. దీంతో మేం చాలా బాధ పడ్డాం. కానీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారత అభిమానుల నుంచి మాకు సాదర స్వాగతం లభించింది. ప్రస్తుతం అందరి ప్రార్థనలు, ఆశీర్వాదం వల్లే మేం ఈ సారి ప్రపంచ కప్ గెలిచాం. మేం మాత్రమే మ్యాచ్ ఆడలేదు. భారత అభిమానులంతా మాతో కలిసి వరల్డ్ కప్ ఆడి గెలిచారని భావిస్తున్నాం’ అని హర్మన్ పేర్కొంది.