Jahanara Alam: జూనియర్లను కొడుతుంది: జహనారా ఆలమ్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:16 PM
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్లను కొడుతోందని, జట్టులో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలను ఆధారరహితమని ఖండించింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై సీనియర్ పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర విమర్శలు చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణం కల్పించడంలో కెప్టెన్ విఫలమైందని ఆరోపించింది. బంగ్లా క్రికెట్ బోర్డు తీరును కూడా ఆలమ్ తప్పు బట్టింది. అయితే ఆలమ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని బంగ్లా క్రికెట్ బోర్డు కొట్టిపడేసింది.
‘నేను(Jahanara Alam) చివరిసారిగా 2024 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తరఫున ఆడాను. నేను చెప్పే దాంట్లో కొత్తేమీ లేదు. నిగర్ జోటీ(Nigar Sultana) తన జూనియర్లను విపరీతంగా కొడుతుంది. ప్రపంచ కప్ సమయంలో కూడా ఆ ప్లేయర్లు నాతో చెప్పుకొని బాధపడేవారు. పొరపాట్లు మళ్లీ జరగవని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకుండా అలాగే వేధిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా తమను కొట్టిందని చాలా మంది అంటుండగా విన్నా. దుబాయ్ పర్యటన సమయంలోనూ తన రూమ్‌కు పిలిపించుకుని మరీ జూనియర్లను కొట్టింది’ అని ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది.
అందరూ బాధితులే..
‘జట్టును ఎంపిక చేసే విషయంలో పక్షపాతం, అంతర్గత రాజకీయాలు ఎక్కువ. ఈ బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నా. నాతో పాటు ప్రతిఒక్కరూ బాధితులే. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా బాధకు గురైనవారే. ఏదో ఒకరిద్దరికి మాత్రమే మంచి సౌకర్యాలు దక్కుతాయి. 2021లో నాతో పాటు మరికొందరు సీనియర్లను పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. నేను మూడు జట్లలో ఒకదానికి సారథిగానూ చేశా. మిగతా రెండింటికి నిగర్, షర్మిన్ కెప్టెన్లుగా ఉన్నారు. అప్పటి నుంచి మాలాంటి సీనియర్లపై ఒత్తిడి పెరిగింది’ అని ఆలమ్ వ్యాఖ్యానించింది.
వాటికి ఆధారాలు లేవు: బీసీబీ
‘మాజీ క్రికెటర్ ఆలమ్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. బోర్డు(BCB)తో పాటు ప్రస్తుత కెప్టెన్, ప్లేయర్లు, స్టాఫ్‌పై విమర్శలు గుప్పించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బంగ్లా మహిళా క్రికెట్ అభివృద్ధి చెందుతున్న దశలో ఇలాంటివి చేయడం బాధాకరం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపిస్తుంది. జట్టు స్ఫూర్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది’ అని బంగ్లా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో ఆలమ్ మానసిక సమస్యల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం కావాలని అడిగినట్లు బీసీబీ ప్రకటించింది. ఇప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె తిరిగి జాతీయ జట్టుకు ఆడటం చాలా కష్టమని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి