Lionel Messi Life Style: కష్టాలను ఎదిరించి.. కోట్లమంది హృదయాల్లో నిలిచిన మెస్సీ
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:06 PM
స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెస్సీ జీవితం గురించి చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి.. నేడు కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయనపై ప్రత్యేక కథనం మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: మెస్సీ ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాలర్ అయ్యాడంటే అది అతడి అమ్మమ్మ సెలియా ఒలివేరా చలవే. సాకర్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని మెస్సీ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. కానీ పొట్టిగా ఉండడంతో ఆటకు పనికి రాడని స్వస్థలం రొసారియోలో కోచ్‌లు ఎద్దేవా చేశారు. కానీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎదిగే సత్తా, నైపుణ్యాలు మనుమడికి పుష్కలంగా ఉన్నాయని భావించిన సెలియా..కోచ్‌లను ఒప్పించి శిక్షణ ఇప్పించారు. ఆమె నమ్మకం వమ్ముకాలేదు. అలా మెస్సీ దిగ్గజ సాకర్ ఆటగాడయ్యాడు. అయితే మెస్సీకి 11 సంవత్సరాల వయస్సులో సెలియా కన్నుమూశారు. దాంతో అతడి గుండె బద్దలయ్యింది. ఆ విషాదం నుంచి కోలుకొని తిరిగి ఆటపై మనసు లగ్నం చేయడానికి మెస్సీకి చాలాకాలం పట్టింది. అమ్మమ్మకు నివాళిగా..తాను చేసిన ప్రతి గోల్ తర్వాత మెస్సీ తన రెండు చేతులు ఆకాశంవైపు చూపుతుంటాడు.
హార్మోన్ లోపంతో అనారోగ్యం..
చిన్నతనం నుంచి మెస్సీ ఎంతో సిగ్గూ.. బిడియంతో ఉండేవాడు. దీంతోపాటు ఎత్తు కూడా తక్కువే. కానీ, ఎప్పుడైతే ఫుట్‌బాల్‌ను టచ్ చేశాడో.. అతడిలో ఏదో తెలియని అనుభూతి.. సంతోషంతో ముఖం వెలిగిపోయింది. ఇక్కడి నుంచి సర్వం మారిపోయింది. ఎప్పుడో ఒక్కసారి మాట్లాడే పిల్లవాడు.. హఠాత్తుగా డ్రిబ్లింగ్, పాస్‌లు, గోల్స్‌తోనే తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆరంభించాడు. అయితే, 11 ఏళ్ల వయసులో హార్మోన్ ఎదుగుదల లోపం (హార్మోన్ గ్రోత్ డెఫిషియెన్సీ) బయటపడడంతో సాకర్‌లో అతడి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఎన్నో క్లబ్‌లు అతడి ప్రతిభను కొనియాడినా.. చికిత్స ఖర్చులు భరించేందుకు వెనకడుగేశాయి. కానీ, బార్సిలోనా క్లబ్ ముందుకురావడంతో కెరీర్ మలుపు తిరిగింది.

'న్యాప్కిన్'పై కాంట్రాక్ట్.. ఎదురులేని పోరాటం..
న్యాప్కిన్ కాంట్రాక్ట్.. బార్సి లోనా ఫుట్‌బాల్ క్లబ్ చారిత్రక ఘట్టాల్లో ఒకటి. 2000 సంవత్సరంలో ఆ క్లబ్ యూత్ అకాడమీ లా మాసా లో ట్రయల్స్ కోసం మెస్సీ అర్జెంటీనా నుంచి బార్సిలోనా వచ్చాడు. అతడి ప్రతిభా పాటవాలు బార్సిలోనా యాజమాన్యాన్ని అబ్బురపరిచినా.. ఒప్పందంపై చర్చలు కొలిక్కి రాలేదు. కానీ, మెస్సీని వదులుకోరాదనుకున్న ఆ క్లబ్ టెక్నికల్ డైరెక్టర్ కార్లోస్ రెక్సాచ్.. చివరకు యాజమాన్యాన్ని ఒప్పించి అప్పటికప్పుడే అగ్రిమెంట్ కుదిర్చాడు. కానీ ఒప్పందం రాసుకొనేందుకు తెల్ల పేపర్ లేకపోవడంతో అక్కడి ఓ పేపర్ న్యాప్కిన్‌పై అగ్రిమెంట్ రాసి మెస్సీ తండ్రి జార్జ్, రెక్సాచ్ సంతకాలు చేశారు. ఆ ఏడాది డిసెంబరు 14న జరిగిన ఈ ఘటనను ‘ఇది ఒక కాంట్రాక్ట్ కాదు.. నవ శకానికి నాంది’ అని సాకర్ పండితులు అభివర్ణిస్తారు. ఈ న్యాప్కిన్‌ను గతేడాది వేలం వేస్తే ఏకంగా రూ. 8 కోట్లకు పైగా అమ్ముడవడం ఆటలో మెస్సీ శక్తి, సామర్ధ్యాలకు నిదర్శనం.

చిన్నారుల ప్రాణదాత..
చిన్నప్పుడు అనారోగ్యంపాలైన మెస్సీ..ఏ అర్జెంటీనా చిన్నారీ వాటిని ఎదుర్కోకూడదని తలిచాడు. తన ఫౌండేషన్ తరపున ఎందరో అర్జెంటీనా చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నాడు. వారికి స్పెయిన్‌లో చికిత్స చేయించి, తిరిగి అర్జెంటీనా తీసుకురావడం, వారు కోలుకొనేందుకు అయ్యే ఖర్చు వరకు మొత్తం తానే భరిస్తున్నాడు. అంతేకాదు కొన్ని ప్రత్యేక చికిత్సలకు సంబంధించి అర్జెంటీనా వైద్యులు స్పెయిన్‌లో శిక్షణ పొందేందుకు అవసరమైన ఆర్థిక సాయమూ చేస్తున్నాడు.

దర్పం మచ్చుకైనా లేదు
విఖ్యాత ఫుట్‌బాలర్‌గా పేరు ప్రఖ్యాతులు..వేలాది కోట్ల ఆస్తి..అయినా హంగు, ఆర్భాటం, దర్పం మచ్చుకైనా కనిపించవు మెస్సీలో. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’ అనే సామెతకు నిలువుటద్దంగా నిలుస్తాడు. లగ్జరీలకు అతడు ఆమడ దూరంలో ఉంటాడు. పైగా..' ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే రొసారియోకు చెందిన సాధారణ బాలుడిని’ అని మెస్సీ అనడం అతడి వినమ్రతకు నిదర్శనం.
మ్యాచ్‌కు ముందు వాంతులు..
తొలి నాళ్లలో మ్యాచ్‌లకు ముందు మెస్సీ ఎంతో ఆందోళన చెందేవాడు. దరిమిలా వాంతులు చేసుకొనేవాడు. ఒక్కోసారి మ్యాచ్ మధ్యలోనూ వాంతులయ్యేవి. ఆహారం విషయంలో పట్టింపులు లేకుండా వ్యవహరించడంతో అలా అయ్యేదట. తర్వాత డైట్ విషయంలో కఠినంగా ఉండడంతో వాంతుల సమస్య తగ్గిపోయింది.

'ఎడారి'లో దాహం తీరింది..
2022 కతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్.. ఒకరకంగా మెస్సీకి చివరి అవకాశం. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి. ఇంత గొప్ప ఆటగాడి కెరీర్ వరల్డ్‌కప్‌ను అందుకోకుండానే ముగుస్తుందా? అనే నిర్వేదం. కానీ, డీలా పడిన జట్టులో స్ఫూర్తిని రగిల్చిన మెస్సీ.. వరుస విజయాలతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫ్రాన్స్‌తో టైటిల్ ఫైట్‌లో డ్రామా నడిచినా.. షూటౌట్‌లో అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ.. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’గా తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నాడు.
ఆ అవార్డు ఎనిమిది సార్లు..
‘బాలన్ డి వోర్’ అవార్డు సాకర్ ఆటగాళ్లకిచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. అలాంటి ఈ పురస్కారాన్ని మెస్సీ ఏకంగా ఎనిమిది సార్లు గెలుచుకోవడం విశేషం. ఈ అవార్డును ఇన్నిసార్లు బహుశా మరే ఫుట్‌బాలర్ చేరుకోకపోవచ్చు. ఇంకా..ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ప్లేయర్‌కు ప్రదానం చేసే ‘గోల్డెన్ బాల్’ను రెండుసార్లు (2014,. 2022) అందుకున్నదీ మెస్సీనే.

ఇప్పటికీ చెదరని రికార్డు..
మెస్సీ పేరిట ఓ రికార్డు ఇప్పటికి పదిలంగా ఉంది. అదేంటంటే..ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ చేయడం. 2012లో 91 గోల్స్ కొట్టాడు. ఇంకా..ఒకే క్లబ్, (బార్సిలోనా) తరపున అత్యధికంగా 672 గోల్స్ చేసిన రికార్డూ లియోనెల్ సొంతం. లా లిగా టోర్నీలో అత్యధిక గోల్స్ (474) కూడా మెస్సీ పేరిటే రికార్డు ఉంది.
టియాగో కారు అలా..
2016లో టాటా గ్రూప్ విడుదలజేసిన టియాగో కారుకు అంతకుముందు జికా అన్న పేరుండేది. ఆ సమయంలో జికా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమయంలో జికా పేరును మార్చాలని టాటా గ్రూప్ అనుకుంది. అప్పుడు టాటా సంస్థకు లియోనెల్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. మెస్సీ పెద్ద కుమారుడి పేరు థియాగో. ఈ పేరు కలిసొచ్చేలా జికాకు మార్పులు చేసి టాటా టియాగో అన్న కొత్త కారును మార్కెట్‌లోకి విడుదలజేసింది టాటా సంస్థ. దీంతో ఈ కార్ల విక్రయాలు భారీగా జరిగి టాటా సంస్థ లాభాలు గడించింది. అలా..టాటా గ్రూప్‌కు మెస్సీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

ఇవీ చదవండి: