India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:03 AM
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతోంది. బ్యాటర్లు విజృంభించిన చోట.. భారత స్పిన్నర్లు సైతం...
తొలి ఇన్నింగ్స్ 518/5 డిక్లేర్
కెప్టెన్ గిల్ అజేయ శతకం
విండీస్ తొలి ఇన్నింగ్స్ 140/4
జడేజాకు మూడు వికెట్లు
రెండో టెస్టు భారత్ ఆల్‌రౌండ్ షో
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతోంది. బ్యాటర్లు విజృంభించిన చోట.. భారత స్పిన్నర్లు సైతం పర్యాటక విండీస్‌ను కట్టడి చేస్తున్నారు. యశస్వీ జైస్వాల్ (175) డబుల్ సెంచరీ కోల్పోయినా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) తన చివరి ఏడు టెస్టుల్లో ఐదో శతకంతో సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురెల్ (44), నితీశ్ కుమార్ (43) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్ వారికన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో సెషన్ మధ్యలో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఫ్లాట్ పిచ్‌పైనా పట్టు తప్పింది. స్పిన్నర్ జడేజా (3/37) ధాటికి రెండో రోజు శనివారం ఆట ముగిసేసరికి 43 ఓవర్లలో 140/4 స్కోరుతో విండీస్ కష్టాల్లో పడింది. అథనజె (41), చందర్‌పాల్ (34) కాస్త పోరాడడంతో రెండో వికెట్‌కు 66 రన్స్ చేరాయి. క్రీజులో షాయ్ హోప్ (31), ఇమ్లాచ్ (14) ఉన్నారు. కుల్దీ్‌పనకు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం 378 పరుగులు వెనుకబడిన విండీస్ ఫాలోఆన్ ప్రమాదంలో పడింది.
గిల్ జోరు: ఓవర్‌నైట్ స్కోరు 318/2తో రెండోరోజు ఆట ఆరంభించిన భారత్ తమ సెషన్నర ఆటలో మరో 200 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అయితే తొలి సెషన్ రెండో ఓవర్‌లోనే గట్టి ఝలక్ తగిలింది. డబుల్ సెంచరీ ఖాయమనిపించిన జైస్వాల్ సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. మిడాఫ్ దిశగా డ్రైవ్ ఆడిన అతను సింగిల్ కోసం పరుగుతీశాడు. అయితే నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో గిల్ కాస్త ముందుకు వచ్చినా మళ్లీ వెనక్కి మళ్లాడు. అప్పటికే యశస్వీ సగం క్రీజు దాటేశాడు. అటు చందర్‌పాల్ నుంచి అందుకున్న త్రోతో కీపర్ ఇమ్లాచ్ రనౌట్ చేయడంతో జైస్వాల్ పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. తొలిరోజు చివర్లో నిదానంగా ఆడిన గిల్ శనివారం మాత్రం బ్యాట్ ఝుళిపించాడు. అతడికి నితీశ్ సహకరించాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకున్న నితీశ్.. గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాక వారికన్‌కు చిక్కాడు. లంచ్ బ్రేక్ తర్వాత గిల్-జురెల్ ఆధిపత్యం చూపారు. కెరీర్‌లో పదో శతకం పూర్తి చేశాక గిల్ ఎదురుదాడి ఆరంభించాడు. చేజ్ ఓవర్‌లో సిక్సర్ బాదిన వెంటనే పియర్ ఓవర్‌లో మూడు ఫోర్లతో 12 రన్స్ రాబట్టాడు. అయితే ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించాక జురెల్ అవుట్ కాగా.. ఆ వెంటనే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఒకే ఏడాదిలో ఐదు శతకాలు బాదిన రెండో భారత కెప్టెన్‌గా గిల్. కోహ్లీ (2017, 2018) రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. అలాగే అలిస్టర్ కుక్ (9), గవాస్కర్ (10) తర్వాత తక్కువ ఇన్నింగ్స్ (12)లోనే ఐదు సెంచరీలు సాధించిన సారథిగా గిల్ నిలిచాడు.
64 ఏళ్ల తర్వాత విండీ్‌సపై తొలి ఐదుగురు బ్యాటర్ల మధ్య 50+ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. 1960లో చివరిసారి ఆసీస్ జట్టు ఈ రికార్డు నెలకొల్పింది.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి