IND Vs NZ: ఇండియాతో వన్డే సిరీస్.. 'కేన్ మామ' సంచలన నిర్ణయం.!
ABN , Publish Date - Dec 23 , 2025 | 10:37 AM
మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు వచ్చే ఏడాది భారత్‌కు రానుంది కివీస్. అయితే.. ఈ టూర్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియాతో వన్డే సిరీస్ ఆడేందుకు 2026 జనవరిలో భారత్‌లో పర్యటించనుంది న్యూజిలాండ్(IND Vs NZ Series). ఈ తరుణంలో కివీస్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ఆడేందుకు అతడు ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్(Durben Super Jaints)తో ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఈ సిరీస్‌కు దూరం కానున్నట్టు సమాచారం.
జనవరి 11 నుంచి 18 వరకు జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియాతో తలపడనుంది కివీస్. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన కేన్.. కేవలం వన్డే, టెస్ట్ క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
అయితే.. ఇటీవల ఎక్కువగా కుటుంబంతో సమయం గడిపేందుకే ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్న 35 ఏళ్ల కేన్.. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. కేవలం టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే కివీస్ జట్టుకు ప్రాతినధ్యం వహించాడు. విండీస్‌తో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 'నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అదే సమయంలో క్రికెట్ పట్ల నాకున్న ఇష్టం కూడా ఏమాత్రం తగ్గలేదు. అందుకే నా ప్రొఫెషనల్ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతాను. ఒక్కో సిరీస్ మధ్య కాస్తంత విరామం తీసుకుని జాతీయ జట్టుకు ఆడతాను' అని విలియమ్సన్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. కేన్ భారత పర్యటనకు దూరం కానున్నాడనే సమాచారంతో అతడి అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ఇవీ చదవండి: