Share News

Rohit Sharma Opens Up: ఆ ఓటమితో రిటైర్‌ కావాలనుకున్నా

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:44 AM

మూడేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ఓటమి తననెంతో కుంగదీసిందని మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు...

Rohit Sharma Opens Up: ఆ ఓటమితో రిటైర్‌ కావాలనుకున్నా

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ఓటమి తననెంతో కుంగదీసిందని మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. 2023లో జరిగిన ఆ మెగా టోర్నమెంట్‌లో రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో తుది పోరుకు దూసుకొచ్చింది. కానీ టైటిల్‌ ఫైట్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ‘ఆ మ్యాచ్‌ నా నుంచి అన్నీ తీసుకుపోయిందని అనిపించింది’ అని గుర్గావ్‌లో మాస్టర్స్‌ యూనియన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ రోహిత్‌ పేర్కొన్నాడు. ‘2023 ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమితో తీవ్ర నిరాశకు లోనయ్యా. ఇకపై క్రికెట్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నా’ అని వెల్లడించాడు. ‘ఆ పరాజయభారం నుంచి కోలుకొనేందుకు కొంత సమయం పట్టింది. నేను అమితంగా ప్రేమించే ఆటను వీడడమా అని పదే పదే ప్రశ్నించుకున్నా. జీవితం ఇంతటిలో ముగిసిపోలేదని, అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయని నచ్చజెప్పుకొన్నా. దాంతో నెమ్మదిగా కోలుకున్నా. శక్తినంతా కూడదీసుకొని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టా’ అని రోహిత్‌ వివరించాడు. ‘వరల్డ్‌ కప్‌ గెలవడం నా ప్రధాన లక్ష్యం. అది టీ20 ప్రపంచకప్‌ కావొచ్చు లేదా 2023 వరల్డ్‌ కప్‌ కావొచ్చు. కానీ అది జరగలేదు. మేమేకాదు అంతా నిరాశకు గురయ్యారు. జరిగిందేమిటో మాకు అంతుబట్టలేదు. వ్యక్తిగతంగానూ అది నాకు క్లిష్ట సమయం. ఎందుకంటే 2023 వరల్డ్‌ కప్‌ కోసం నేను ఎంతో కష్టపడ్డా. 2022లో నేను సారథ్య బాధ్యతలు చేపట్టినుంచే ప్రపంచ కప్‌ కోసం సమాయత్తమయ్యా’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్

ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్

Updated Date - Dec 23 , 2025 | 05:44 AM