Share News

India Women Cricket: ఫీల్డింగ్‌ లోపాలకు చెక్‌ పెట్టాలని

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:50 AM

రెండో టీ20 నేడు రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

India Women Cricket: ఫీల్డింగ్‌ లోపాలకు చెక్‌ పెట్టాలని

రెండో టీ20 నేడు

రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఆత్మవిశ్వాసంతో భారత మహిళల జట్టు

సమం కోసం లంక ఆరాటం

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): శ్రీలంకతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత మహిళల జట్టు అద్భుత విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన అదరగొట్టినా.. ఫీల్డింగ్‌ మాత్రం పేలవం. ఏకంగా ఐదు క్యాచ్‌లను మన అమ్మాయిలు చేజార్చారు. ఈ నేపథ్యంలో లంకతో మంగళవారం జరిగే రెండో టీ20లో మెరుగైన ఫీల్డింగ్‌తో ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత హర్మన్‌సేన ఆరు వారాలు విశ్రాంతి తీసుకొంది. ఓ వారం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో ప్రాక్టీస్‌ చేసిన అనంతరం బరిలోకి దిగింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ విఫలమైనా.. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత్‌ అలవోకగా నెగ్గింది. పేసర్‌ క్రాంతి గౌడ్‌తోపాటు స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి కట్టుదిట్టంగానే బౌలింగ్‌ చేశారు. జట్టులోకి కొత్తగా వచ్చిన వైష్ణవి శర్మ వికెట్లు పడగొట్టక పోయినా పొదుపుగా బంతులేసింది. మరోవైపు లంక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీ్‌సను సమం చేయాలనుకొంటోంది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు బ్యాటింగ్‌కు ప్రధాన బలం. మిడిలార్డర్‌ బ్యాటర్లు విష్‌మి గుణరత్నే, హర్షిత, హాసిని జట్టుకు అండగా నిలవాల్సి ఉంది.


333-Sports.jpgసింహాచలం ఆలయ ప్రాంగణంలోని గోదాదేవి అమ్మవారిని సోమవారం దర్శించుకున్న భారత క్రికెటర్లు స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్‌కౌర్‌, అరుంధతిరెడ్డి, రిచాఘోష్‌.

జట్లు (అంచనా)

భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌, అరుంధతి, క్రాంతి, వైష్ణవి శర్మ, శ్రీచరణి.

శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్‌), విష్‌మి, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హారి, నీలాక్షి సిల్వ, కౌషిని నుత్యాంగన (వికెట్‌ కీపర్‌), ఇనోకా రణవీర, మాల్కి మదార, కవింది, షాషిని గిమ్హాని.

పిచ్‌/వాతావరణం..

తొలి మ్యాచ్‌ ఆడినప్పటి పరిస్థితులే ఉన్నాయి. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి భారీ స్కోర్లు నమోదుకావచ్చు. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ బౌలింగ్‌ ఎంచుకోవచ్చు.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్

ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్

Updated Date - Dec 23 , 2025 | 05:50 AM