Share News

Fakhar Zaman: అంపైర్లతో వాగ్వాదం.. పాక్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌కు ఐసీసీ షాక్

ABN , Publish Date - Dec 05 , 2025 | 08:13 PM

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమానాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ముక్కోణపు సిరీస్‌లో అంపైర్లతో వాగ్వాదం కారణంగా.. అతడి ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేసింది.

Fakhar Zaman: అంపైర్లతో వాగ్వాదం.. పాక్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌కు ఐసీసీ షాక్
Fakhar Zaman

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు ఐసీసీ షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో అంపైర్లతో వాగ్వాదం కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించింది. దాంతోపాటు ఫఖర్(Fakhar Zaman) ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను జోడించింది. దీనికి సంబంధించి ఐసీసీ(ICC) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.


‘ఫఖర్ జమాన్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. అందుకు అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి ఓ మెరిట్ పాయింట్ మాత్రమే జత చేస్తున్నాం. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల ధిక్కారం చూపినందుకు ఫఖర్‌ను శిక్షిస్తున్నాం. ఫఖర్ కూడా తన తప్పును అంగీకరించాడు’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే.. ఆ ప్లేయర్‌పై నిషేధం విధిస్తారు.


అసలేమైందంటే?

శ్రీలంక-జింబాబ్వేలతో పాకిస్తాన్ ముక్కోణపు సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. నవంబర్ 29న రావల్పిండి వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ ఫైనల్‌లో తలపడ్డాయి. అయితే 19వ ఓవర్‌లో ఫఖర్ తన వికెట్‌పై అసంతృప్తితో ఆన్‌-ఫీల్డ్‌ అంపైర్లతో చాలా సేపు వాదన కొనసాగించాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకుంది. ఫఖర్ తన తప్పును అంగీకరించడంతో, మ్యాచ్‌ రిఫరీ రియాన్‌ కింగ్‌ ప్రతిపాదించిన శిక్షను ఐసీసీ నేరుగా అమలు చేసింది. ఫార్మల్‌ విచారణ అవసరం లేకుండానే ఈ వ్యవహారాన్ని ముగించారు. అంపైర్లు అహ్సన్‌ రాజా, ఆసిఫ్‌ యాకూబ్‌, థర్డ్‌ అంపైర్‌ రషీద్‌ రియాజ్‌, ఫోర్త్‌ అంపైర్‌ ఫయ్సల్‌ అఫ్రిడి.. ఫఖర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే లెవల్-1 ఉల్లంఘనకు ఆటగాడిపై 50 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. కానీ పది శాతమే ఫఖర్‌పై జరిమానా విధించడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

కెప్టెన్సీ నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీదే: రియాన్ పరాగ్

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

Updated Date - Dec 05 , 2025 | 08:13 PM