Hikaru Nakamura Gukesh: గుకేష్‌ను ఓడించిన నకమురా.. రాజును జనాల్లోకి విసరడంపై చర్చ
ABN , Publish Date - Oct 06 , 2025 | 06:41 PM
అమెరికాలో చెక్‌మేట్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఎగ్జిబిషన్ చెస్ ఈవెంట్‌లో ఆదివారం చోటు చేసుకున్న ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా, భారత యువ వరల్డ్ చెస్ ఛాంపియన్ డి.గుకేష్ పై విజయం సాధించాడు. ఆ క్రమంలో ఆట ముగిసిన వెంటనే నకమురా రాజు (కింగ్) పీస్‌ను జనాల్లోకి విసిరాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
అమెరికా: టెక్సాస్ వేదికగా జరిగిన చెక్‌మేట్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఎగ్జిబిషన్ చెస్ మ్యాచ్‌లో ఓ సంఘటన విమర్శలకు దారితీసింది. ప్రపంచ చెస్ వేదికపై యువ భారత గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌ను గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా ఓడించి తన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆ క్రమంలో గేమ్ ముగిసిన వెంటనే నకమురా చేసిన ఒక అనూహ్య చర్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గేమ్ ముగిసిన వెంటనే గుకేష్ కింగ్ పీస్‌ను తీసి ప్రేక్షకుల్లోకి విసరడం వివాదాస్పదంగా మారింది. చెస్‌లో రాజు అంటే ఓ గౌరవప్రదమైన ప్రతీక. అలాంటి పీస్‌ను అశ్రద్ధగా విసరడం స్పోర్ట్స్‌మాన్‌షిప్‌కు విరుద్ధమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రష్యా దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ సైతం స్పందించి, నకమురా ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ చెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
నకమురా చర్య వెనుక..
నకమురా చేసిన ఈ చర్య పూర్తిగా నిర్వాహకుల ఆలోచన అని తెలుస్తోంది. దీనిపై అమెరికా చెస్ నిపుణుడు లెవీ రోజ్‌మన్ తన యూట్యూబ్ వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ చర్య వెనుక సందర్భం లేకపోతే అది అనవసర చర్యలా కనిపిస్తుందన్నారు. నిర్వాహకులు ఈ వినోదాత్మక కోణాన్ని కావాలని యాడ్ చేసినట్లు చెప్పారు.
గుకేష్‌తో జరిగిన గేమ్‌లో విజేత.. రాజు పీస్‌ను ప్రేక్షకుల్లోకి విసిరేయాలని ప్లాన్ చేశారు. గుకేష్ గెలిచి ఉంటే అతను అలా చేసేవాడో లేదో తెలియదు. కానీ నకమురా తర్వాత గుకేష్‌తో మాట్లాడి ఇదంతా వినోదం కోసమేనని, ఎలాంటి ఉద్దేశం లేదని వివరించాడని రోజ్‌మన్ అన్నారు. కానీ ఈ చర్య చెస్ సాంప్రదాయ గౌరవాన్ని దెబ్బతీసిందని విమర్శకులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి