Harbhajan Singh: రో-కోను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందే.. భజ్జీ డిమాండ్!
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:38 PM
రానున్న వన్డే ప్రపంచ కప్‌లో రో-కోలను ఆడించాలని టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ యాజమాన్యానికి సూచించాడు. వారు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని.. వారి కంటే మెరుగైన ఆటగాళ్లు లేరని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు(57,75) చేశాడు. విరాట్ వరసుగా రెండు సెంచరీలు (135,102), ఓ హాఫ్ సెంచరీ(65*) చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రో-కో గురించి టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) మాట్లాడాడు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారా? వారిని జట్టు నుంచి తప్పించకూడదు. అలా కాదు అనుకుంటే వారి అనుభవాన్ని యువ క్రికెటర్లు ఉపయోగించుకునేలా జట్టును రూపొందించాలి. టీమ్ మొత్తాన్ని యువ క్రికెటర్లతో నింపాలని చూస్తే.. పెద్ద మ్యాచుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రో-కోను రానున్న వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడించాలి. ఆ తర్వాత వారు మరో ప్రపంచ కప్ ఆడే అవకాశమే లేదు కదా’ అని భజ్జీ విశ్లేషించాడు.
అందులో తప్పేమీ లేదు.. కానీ!
‘రోహిత్, విరాట్ ప్రస్తుతం చేస్తున్న బ్యాటింగ్‌ను చూస్తుంటే .. టీమిండియా చాలా బలంగా కనిపిస్తోంది. వారు తమ ఫిట్‌నెస్ కూడా చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే వారు ప్రపంచ కప్ ఆడేందుకు అవకాశం దక్కుతుందా? లేదా? అనే విషయంలోనే సందిగ్ధత ఉంది. యువ ఆటగాళ్లను ఆడించడంలో తప్పు లేదు. కానీ అదే సమయంలో మ్యాచులను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉన్న సీనియర్లను విస్మరించకూడదు.
గత ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడింది. పిచ్ చాలా నెమ్మదిగా ఉండటమే దీనికి కారణం. మంచి పిచ్ మీద గనుక ఆడి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది. ఆస్ట్రేలియా ఒత్తిడిలోనూ బాగా ఆడింది. అందుకే టీమిండియాపై విజయం సాధించింది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసింది. అందుకే రో-కోలను జట్టులోకి తీసుకున్న తర్వాతే మిగతా ఆటగాళ్లను ఎంపిక చేయాలి’ అని భజ్జీ వెల్లడించాడు.
ఇవీ చదవండి:
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్
సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు