Gambhir-Suryakumar Yadav: సూర్య ఫామ్ సమస్యే కాదు: గంభీర్
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:03 PM
సూర్య కుమార్ యాదవ్ ఫామ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్య త్వరగా ఔటవుతున్నాడని, కాబట్టి అతడి ఫామ్ గురించి ఆందోళన పడటం అనవసరమని అన్నాడు.
సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav).. టీమిండియా(Team India) టీ20 జట్టు కెప్టెన్ అయ్యాక పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లోనూ నిరాశపరిచాడు. 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 72 పరుగులే చేశాడు. అయితే ఈ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) స్పందించాడు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్య త్వరగా ఔటవుతున్నాడని, కాబట్టి అతడి ఫామ్ గురించి ఆందోళన పడటం అనవసరమని అన్నాడు.
‘నిజాయితీగా చెప్పాలంటే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ నన్ను పెద్దగా కలవర పెట్టట్లేదు. ఎందుకంటే డ్రెస్సింగ్ రూంలో మేం దూకుడైన బ్యాటింగ్ శైలికి ప్రణాళిక రూపొందించుకున్నాం. దాన్ని అనుసరించినప్పుడు వైఫల్యాలు కూడా ఎదురవుతుంటాయి. 30 బంతుల్లో 40 పరుగులు చేయడం సూర్యకు తేలికైన విషయం. అలా చేసి కూడా విమర్శలను తప్పించుకునే వెసులుబాటు ఉంది.
కానీ మేం అలా చేయాలని అనుకోవడం లేదు. దూకుడుగా ఆడి వైఫల్యం ఎదురైనా అంగీకరించాలని కలసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ గొప్పగా ఆడాడు. అతడు ఇదే ఫామ్‌ను ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నాం. సూర్య కూడా ఫామ్ అందుకుంటే అతడు మరింత బాధ్యత తీసుకుంటాడు. సూర్య మంచి మనిషి. మంచి మనుషులే మెరుగైన నాయకులు అవుతారు. జట్టు తనది. ఆటను గమనించి అతడికి సరైన సలహాలు ఇవ్వడమే నా పని’ అని గంభీర్ వివరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్