Share News

Diego Maradona: మారడోనా.. ది లెజెండ్!

ABN , Publish Date - Oct 30 , 2025 | 03:30 PM

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ డియాగో ఆర్మాండో మారడోనా మాత్రం లెజెండ్. ఆటను కళగా, ఆవేశంగా, దైవత్వంగా మలిచిన ఆ మహానుభావుడి జన్మదినం నేడు. అక్టోబర్‌ 30.. ప్రతి ఏడాది ఈ రోజున ఫుట్‌బాల్‌కు ఆత్మ లాంటి అతడి గొప్పతనాన్ని అభిమానులు సహ ప్రపంచమంతా స్ఫురించుకుంటుంది.

Diego Maradona: మారడోనా.. ది లెజెండ్!

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్‌ ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ డియాగో ఆర్మాండో మారడోనా(Diego Maradona) మాత్రం లెజెండ్. ఆటను కళగా, ఆవేశంగా, దైవత్వంగా మలిచిన ఆ మహానుభావుడి జన్మదినం నేడు. అక్టోబర్‌ 30.. ప్రతి ఏడాది ఈ రోజున ఫుట్‌బాల్‌కు ఆత్మ లాంటి అతడి గొప్పతనాన్ని అభిమానులు సహ ప్రపంచమంతా స్ఫురించుకుంటుంది.


పేదరికం నుంచి ప్రపంచ వేదిక వరకు..

అర్జెంటీనా(Argentina)లోని బ్యూనస్‌ ఐరీస్‌లోని విల్లా ఫియొరిటో అనే పేదవాడలో జన్మించిన మారడోనా చిన్నప్పటి నుంచే తన కలల ప్రపంచం వైపు దారులు వేసుకున్నాడు. దుమ్ముతో నిండిన వీధుల్లో బూట్లు లేకుండా ఆడుతూ… ప్రపంచాన్ని గెలిచే కలలు కన్నాడు. కష్టాల మధ్య పెరిగిన అతడు తన ప్రతిభతో అర్జెంటీనా జట్టులో చోటు సంపాదించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టాడు.


ఫుట్‌బాల్‌ దేవుడిగా ఎదిగిన క్షణం..

1986 ఫిఫా ప్రపంచ కప్.. మారడోనాను ఫుట్‌బాల్ దేవుడిగా నిలబెట్టింది. మెక్సికోలో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అతడు వేసిన రెండు గోల్స్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. ఒకటి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’, మరొకటి ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’(Goal of the Century).. తన సగం మైదానం నుంచే బంతిని డ్రిబుల్‌ చేస్తూ ఐదుగురిని దాటుకొని చేసిన ఆ గోల్‌ ఇప్పటికీ ఫుట్‌బాల్‌ చరిత్రలో అజరామరం. ఆ విజయం అర్జెంటీనాకు కేవలం ట్రోఫీని అందిచడమే కాదు… ఆ దేశానికి గౌరవం, గర్వం, జాతీయతకు ప్రతీకగా మారింది.


నేపోలీకి ప్రాణం పోసిన అద్భుతం

1984లో ఇటలీ క్లబ్‌ నేపోలీలో చేరిన మారడోనా అక్కడ కూడా చరిత్ర సృష్టించాడు. బార్సిలోనాను వదిలి.. పసికూన జట్టుకి చేరాడని అనుకున్న వారంతా అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. ఆయన నాయకత్వంలో నేపోలీ రెండు సెరియా-ఏ టైటిల్స్, ఒక యూఈఎఫ్ఏ కప్‌ గెలిచింది. దక్షిణ ఇటలీ పేదవారిలో మారడోనా దేవుడిలా మారిపోయాడు. ఆయన గౌరవార్థం వీధులు, గోడలు, దేవాలయాలు కూడా ఆయన చిత్రాలతో నిండిపోయాయి.


విజయాలు.. వివాదాలు..!

మారడోనా జీవితం విజయాలతో పాటు వివాదాలతోనూ నిండింది. మద్యం, రాజకీయాలు.. అన్నీ ఆయనను వెంటాడినా, అభిమానుల హృదయాల్లోని ప్రేమ మాత్రం తగ్గలేదు. ఆయన గొప్పతనం ఆయన లోపాల్లోనే ఉందని అంటారు. 2020లో మారడోనా ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు. కానీ ఆయన నీడ ఇప్పటికీ ఫుట్‌బాల్‌ మైదానాలపై ఉందని అభిమానులు గట్టిగా నమ్ముతారు.బ్యూనస్‌ ఐరీస్‌ నుంచి నేపోలీ వరకు ఆయన విగ్రహాలు, జెర్సీలను ప్రజలు ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. మెస్సీ, రొనాల్డో, నేమార్‌ వంటి ఈ తరం ఆటగాళ్లందరికీ మారడోనానే స్ఫూర్తి.

నువ్వు కన్నుమూసినా.. ఎప్పటికీ మా హృదయాల్లో.. ఫుట్‌బాల్ మైదానాల్లో జీవించే ఉంటావు ఛాంప్..- ‘ది ఎటర్నల్ నంబర్ 10’!


ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

Updated Date - Oct 30 , 2025 | 03:35 PM