Share News

Mithali Raj: మేం ప్రపంచ కప్ ఆడితే రూ.వెయ్యి ఇచ్చారు: మిథాలీ రాజ్

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:19 PM

2003 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చారని మిథాలీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళా క్రికెట్‌కు స్పాన్సర్లు, సౌకర్యాలు కూడా లేవని చెప్పారు.

Mithali Raj: మేం ప్రపంచ కప్ ఆడితే రూ.వెయ్యి ఇచ్చారు: మిథాలీ రాజ్
Mithali Raj

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీనికి హర్మన్ సేనకు బీసీసీఐ(BCCI) రూ.51కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj) ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘మహిళల వన్డే ప్రపంచ కప్ 2003( Women’s World Cup 2003) ఫైనల్ ఆడినప్పుడు ఒక్క మ్యాచ్‌కు రూ.వెయ్యి ఇచ్చారు. ఆ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే ఒక్కో ప్లేయర్‌కు రూ.8వేలు వచ్చాయి. అప్పట్లో మహిళల క్రికెట్ పరిస్థితి దయనీయంగా ఉండేది. మ్యాచ్ ఫీజులు, జీతాలు వంటివి క్రికెటర్లకు లేవు’ అని మిథాలీ ఓ షోలో వెల్లడించింది.


బీసీసీఐ పరిధిలో లేకపోవడంతో..

తాజాగా మిథాలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. 2006 వరకు భారత మహిళల క్రికెట్ బీసీసీఐ పరిధిలో లేదు. దాంతో మ్యాచ్‌లు ఆడేందుకు స్పాన్సర్ల కోసం వెతుక్కునేవారు. విరాళాల సాయంతో మ్యాచ్‌లు ఆడేవారు. భారత మహిళా క్రికెట్ అసోసియేషన్.. టీమిండియా జట్టును పర్యవేక్షించేది. 2006లో భారత మహిళా జట్టు బీసీసీఐలో అధికారికంగా వీలినమైంది. అయినా మహిళా క్రికెటర్లపై చిన్నచూపు ఉండేది. మహిళల మ్యాచ్‌లు ప్రత్యక్షంగా ప్రసారం కూడా చేసేవారు కాదు.


టర్నింగ్ పాయింట్ అదే..

2017 ప్రపంచ కప్‌లో చివరి మెట్టు వరకు వచ్చి టీమిండియా ఓటమి పాలైంది. కానీ మహిళలు అద్భుత ప్రదర్శన చేశారు. అదే వారికి టర్నింగ్ పాయింట్ అయింది. గంగూలీ(Sourav Ganguly) బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళా క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. మహిళల దేశవాళీ క్రికెట్‌ను పటిష్టం చేయడంతో పాటు సమాన వేతనాలు ఇవ్వడం ప్రారంభించాడు. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా(Jay Shah).. ఐపీఎల్(IPL) తరహాలోనే డబ్ల్యూపీఎల్(WPL) నిర్వహించాడు. దీంతో మహిళా క్రికెటర్ల రాతే మారిపోయింది. వారి ప్రతిభను దేశమంతా చూసింది.


అప్పుడలా.. ఇప్పుడిలా!

2005లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే భారత క్రికెటర్లకు వచ్చింది రూ.8వేలే. తాజాగా టోర్నీలో హర్మన్ సేనకు రూ.54లక్షలు మ్యాచ్ ఫీజుగా లభించింది. అలవెన్సులు, బీసీసీఐ నజరానా, ఐసీసీ ప్రైజ్ మనీ అదనం. 1983 ప్రపంచ కప్ విజయం దేశంలో క్రికెట్‌ను మతంలా మారిస్తే.. 2025 ప్రపంచ కప్ మహిళా క్రికెట్ గతిని మార్చనుంది. టీమిండియా మహిళలను చూసి ఎంతో మంది అమ్మాయిలను క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకుని రాణిస్తారనడంలో సందేహమే లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 04:17 PM