India Toss Sentiment: టాస్ సెంటిమెంట్.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్న టీమిండియా!
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:06 PM
టీమిండియా అభిమానులకు టాస్ సెంటిమెంట్ ఫుల్ కిక్ ఇస్తోంది. ఇంగ్లండ్ ఏం చేసినా మనదే విజయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ఈ సెంటిమెంట్‌లో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపిన భారత్.. ఘనవిజయంతో 5 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బిగ్ విక్టరీ సాధించడంతో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో లార్డ్స్ టెస్ట్ బరిలోకి దిగింది గిల్ సేన. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చేశాడు. అయితే రెండో టెస్ట్ రేంజ్‌లో మూడో టెస్ట్‌ను మొదలుపెట్టలేదు టీమిండియా. తొలి రోజు ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీయడంలో మన బౌలర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్ సేన.. డే-1 ముగిసేసరికి 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ స్పల్పంగా పైచేయి సాధించిందనే చెప్పాలి. అయితే నెటిజన్స్ మాత్రం టెన్షన్ వద్దు అని అంటున్నారు. దీనికి టాస్ సెంటిమెంటే కారణం.

ఒక్క టాస్ గెలవకుండా..
ఈ ఏడాది ఆరంభం నుంచి టాస్‌ల విషయంలో టీమిండియాకు ఇంకా బ్యాడ్ లక్ నడుస్తోంది. 2025 జనవరి 31వ తేదీ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ టాస్ నెగ్గలేదు. అయితే టాస్ ఓడినా మెన్ ఇన్ బ్లూనే విజయాలు వరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో రోహిత్ శర్మ సారథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఒక్క టాస్ కూడా నెగ్గలేదు. అయినా 3 వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే తంతు. ఒక్క పోరులోనూ కెప్టెన్ హిట్‌మ్యాన్ టాస్ గెలవలేదు. అయినా మన జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఓవరాల్‌గా 12 వరుస మ్యాచుల్లో టాస్ కోల్పోయింది టీమిండియా. అయినా విజయం మాత్రం మనల్నే వరిస్తూ వస్తోంది.

సెంటిమెంట్ రిపీట్..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లోనూ భారత్ టాస్ ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాస్ నెగ్గలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపు భారత్‌దేనని.. మనల్ని ఎవడ్రా ఆపేది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. టాస్ సెంటిమెంట్ రిపీట్ అవడం ఖాయమని.. ఈ గెలుపుతో సిరీస్‌లో 2-1తో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లడం పక్కా అని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి