Harmanpreet Kaur: విజయానంతరం.. తండ్రిని హత్తుకున్న హర్మన్!
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:14 PM
ప్రపంచ కప్ గెలిచిన వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేరుగా వెళ్లి తన తండ్రిని హత్తుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ తన కుమార్తెను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. భారత మహిళలు తమ తొలి ఐసీసీ మహిళా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల తర్వాత ప్రపంచ కప్ గెలిచిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. అయితే విజయానంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్(Harmanpreet Kaur) తన తండ్రిని హత్తుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేరుగా తండ్రి దగ్గరకే..
ప్రపంచ కప్ గెలిచిన ఆ మధురమైన క్షణాలను ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క ప్లేయర్ సంబరాల్లో మునిగిపోయారు. కానీ భారత కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ నేరుగా ప్రేక్షక గ్యాలరీ వైపు పరిగెత్తింది. అక్కడ ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్(Harmander Singh Bhullar)ను గట్టిగా ఆలింగనం చేసుకుంది. తన కుమార్తెను ఒడిలో ఎత్తుకుని తండ్రి ఆనందంతో ఆమెను తిప్పుతుండగా, చుట్టుపక్కల నిండిన హర్షధ్వనులు ఆత్మీయ బంధాన్ని మరింత మధురంగా మార్చాయి.
ఆయన వల్లే..
హర్మన్ ప్రీత్ కౌర్ స్వస్థలం పంజాబ్. ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ కూడా మాజీ క్రీడాకారుడే. హర్మన్ తొలి కోచ్ కూడా ఆయనే. మోగా జిల్లాలోని మట్టిబయళ్లలో బ్యాట్ పట్టుకున్న చిన్నారి హర్మన్.. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని నిలబెట్టిన తీరును హర్మందర్ చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
మ్యాచ్ విన్నింగ్ కెప్టెన్!
ప్రపంచ కప్ లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు హర్మన్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వ్యూహాత్మక ప్రణాళికలు వేసి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడంలో హర్మన్ సఫలమైంది. ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలీతో బౌలింగ్ వేయించడమే దీనికి ఉదాహరణ. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 89 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫైనల్‌కి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. కాగా ఫైనల్ మ్యాచ్‌లో హార్మన్‌ప్రీత్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో టీమిండియా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News