CSK vs KKR Prediction: చెన్నై వర్సెస్ కోల్‌కతా.. తొడ కొట్టేదెవరు.. తడబడేదెవరు..
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:27 PM
Indian Premier League: ఐపీఎల్-2025లో ఇవాళ రైవల్రీ మ్యాచ్ జరగనుంది. రెండు చాంపియన్ టీమ్స్ మధ్య టఫ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. అవే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్. మరి.. ఇద్దరిలో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో అసలు సిసలు ఫైట్‌కు అంతా రెడీ అయింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఏప్రిల్ 11న టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఒక విజయం, ఒక ఓటమి.. ఇలా పడుతూ లేస్తూ పోతున్న కేకేఆర్‌ను వరుస పరాభవాలతో నిరాశలో కూరుకుపోయిన సీఎస్‌కే ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది. చెపాక్‌లో ఎదురులేని సీఎస్‌కే.. ఇటీవల వరుసగా ఓటములు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో చెన్నై తొడ కొడుతుందా.. కేకేఆర్ పడగొడుతుందా.. ఎవరి బలాబలాలు ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
బలాలు
సీఎస్‌కే: రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో పూర్తి సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో ధోని సారథ్యంలో ఇవాళ బరిలోకి దిగనుంది సీఎస్‌కే. సుదీర్ఘ అనుభవం ఉన్న మాహీ కెప్టెన్సీ చేపట్టడం ఆ టీమ్‌కు బిగ్ ప్లస్. బ్యాటింగ్‌లో కాన్వే, దూబె, రచిన్ మంచి టచ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఖలీల్, అశ్విన్ అవసరమైన టైమ్‌లో బ్రేక్‌త్రూలు అందిస్తున్నారు.
కేకేఆర్: ఈ టీమ్‌కు బ్యాటింగే బలం. కెప్టెన్ రహానేతో పాటు వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో హర్షిత్ రాణా రాణిస్తున్నాడు. సునీల్ నరైన్ కూడా శుభారంభాలు అందిస్తున్నాడు.
బలహీనతలు
సీఎస్‌కే: భారీ టార్గెట్స్ సెట్ చేయాలన్నా చేజ్ చేయాలన్నా చెన్నైకి రుతురాజ్ కీలకం. అలాంటోడు ఇప్పుడు టీమ్‌కు దూరమయ్యాడు. ఆరంభం నుంచి చివరి వరకు ఇన్నింగ్స్‌ను నడిపించే బ్యాటర్ లేకపోవడం బిగ్ మైనస్. రచిన్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడట్లేదు. విజయ్ శంకర్ వేగంగా ఆడలేకపోవడం మరో మైనస్. పత్తిరానా, జడేజా వికెట్లు తీయకపోవడం జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
కేకేఆర్: డికాక్, రమణ్‌దీప్ బ్యాటింగ్‌లో ఫామ్ అందుకోవాల్సి ఉంది. రఘువంశీ, రస్సెల్ గత మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయారు. రైట్ హ్యాండ్, లెఫ్టాండ్ కాంబినేషన్ మూసలో ఈ టీమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్న తప్పులు ఓటములకు కారణం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రస్సెల్, రింకూకు ఎక్కువ బంతులు ఆడే చాన్స్ కల్పించకపోవడం మైనస్‌గా మారుతోంది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి పరుగులు కట్టడి చేస్తున్నా వికెట్లు తీయకపోవడం మైనస్‌గా మారింది.
హెడ్ టు హెడ్
ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచులు జరిగాయి. ఇందులో సీఎస్‌కే 19 విజయాలు, కేకేఆర్ 10 విజయాలు నమోదు చేశాయి.
విన్నింగ్ ప్రిడిక్షన్
సీఎస్‌కే ఇప్పుడు డీప్ ట్రబుల్‌లో కనిపిస్తోంది. నిలకడగా ఆడుతూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ దూరమయ్యాడు. వరుస ఓటములతో చెపాక్ కోట కూలుతోంది. ఇప్పుడున్న ధోని మునుపటి మాహీ కాదు. అటు కేకేఆర్ కూడా ఓటమితో వస్తున్నా సీఎస్‌కేతో పోలిస్తే బెటర్ బ్యాలెన్స్, ఫామ్‌లో ఉంది. కాబట్టి, ఏ రకంగా చూసుకున్నా ఇవాళ్టి మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు ఖాయం.