Share News

Ashes 2025-26: కీలక ప్లేయర్‌పై వేటు.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:43 PM

యాషేస్ 2025-26 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. కీలక ఆటగాడిపై వేటు వేసింది.

Ashes 2025-26: కీలక ప్లేయర్‌పై వేటు.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
Ashes 2025-26

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్(Ashes 2025-26) సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి.. ఆసీస్ కు ఇంగ్లీష్ జట్టు గట్టీ పోటీ ఇవ్వలేకపోతుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఘోరంగా ఓడింది. మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని స్టోక్స్(Ben Stokes) బృందం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో కుడిచేతి వాటం పేసర్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.


ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. కంగారూలు సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఇంగ్లాండ్‌ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. కీలక పేసర్‌ అయిన గస్‌ అట్కిన్సన్‌ (Gus Atkinson) పరుగులు (సగటున 78.6) భారీగా ఇస్తున్నాడు. అలానే వికెట్లు తీయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో అతడు కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అట్కిన్సన్‌పై ఇంగ్లాండ్‌ జట్టు మెనేజ్మెంట్ వేటు వేసింది. అతడి స్థానంలో మరో రైటార్మ్‌ పేసర్‌ జోష్‌ టంగ్‌ (Josh Tongue)ను తుది జట్టుకు ఎంపిక చేసింది.


దీంతో మాథ్యూ పాట్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఒక్క మార్పు తప్ప రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లాండ్ కొనసాగించింది. ఆ జట్టులో స్పిన్నర్ల ఎంపిక విషయానికి వస్తే.. షోయబ్‌ బషీర్‌కు మేనేజ్‌మెంట్‌ మరోసారి మొండిచేయి చూపింది. స్పిన్‌ ఆప్షన్‌ కోటాలో బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ను ఎంపిక చేసింది. యాషేస్ సిరీస్ లో ఓవైపు ఆసీస్‌ పేసర్లు విజృంభిస్తున్న పిచ్‌లపై ఇంగ్లాండ్‌ సీమర్లు తేలిపోతున్నారు. ఇక ఆసీస్‌- ఇంగ్లాండ్‌ మధ్య డిసెంబరు 17 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు(Ashes third test) ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్‌ తుది జట్టు:

జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), విల్‌ జాక్స్‌, బ్రైడన్‌ కార్స్‌, జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌.


ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు

వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు

Updated Date - Dec 15 , 2025 | 03:43 PM