Share News

Sridhar Vembu: భారత్‌‌కు తిరిగి రండి.. భయపడొద్దు.. ఎన్నారైలకు జోహో ఫౌండర్ పిలుపు

ABN , Publish Date - Sep 21 , 2025 | 07:37 PM

ఎన్నారైలు భారత్‌కు తిరిగి రావాలని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఐదేళ్లు కష్టపడితే ఇక్కడ లైఫ్‌ను పునర్ నిర్మించుకోవచ్చని అన్నారు.

Sridhar Vembu: భారత్‌‌కు తిరిగి రండి.. భయపడొద్దు.. ఎన్నారైలకు జోహో ఫౌండర్ పిలుపు
Sridhar Vembu advice H-1B visa fee hike

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటున్న ఎన్నారైలు భారత్‌కు తిరిగి రావాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచిన నేపథ్యంలో శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా ఈ అభ్యర్థన చేశారు (Sridhar Vembu advice).

‘దేశ విభజన సమయంలో తాము అన్నీ వదులుకుని కట్టుబట్టలతో భారత్‌కు ఎలా వచ్చిందీ నా సింధీ స్నేహితులు చెప్పగా విన్నాను. ఇక్కడకు వచ్చాక వాళ్లు మళ్లీ తమ జీవితాల్ని పునర్ నిర్మించుకున్నారు. జీవితంలో ఎదిగారు. చక్కగా స్థిరపడ్డారు. అయితే, అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటున్న భారతీయులకు కూడా ఈ సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది విచారకరమైన విషయమే. అయితే, మీరు భారత్‌కు వచ్చేయండి. మీ జీవితాల్ని పునర్ నిర్మించుకునేందుకు కనీసం 5 ఏళ్లు పట్టొచ్చు. కానీ మీరు మరింతగా శక్తిమంతులవుతారు. రాటుదేలుతారు. భయంలో జీవించొద్దు.. ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు ఎలాంటి ఢోకా ఉండదు’ అని ఆయన ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు (NRI Returning to India).


ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టకూడదు. ఇప్పటికే హెచ్-1బీ వీసాపై అక్కడున్న వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ కొత్త రూల్స్ వారికి వర్తించవు. కొత్త వారికి మాత్రమే తాజా నిబంధనలు ప్రతిబంధకం’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘సింధీల వలెనే బెంగాలీలు, పంజాబీలూ కష్టపడ్డారు. కానీ వారు ఈ స్థితికి రావడానికి దాదాపు మూడు తరాలు పట్టింది. జీవితాన్ని పునర్ నిర్మించుకోవడం అంత ఈజీ కాదు. అయితే, ఇదేమీ చెడ్డ విషయం కూడా కాదు’ అని మరో వ్యక్తి అన్నారు. దేశ విభజన తరువాత వలసొచ్చిన వారికి, ఎన్నారైలకు పోలీక తేవడం పొరపాటని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరి కొందరు మాత్రం ఆయన అభిప్రాయాలతో ఏకీభవించారు. భారత్‌లో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

హారతి పళ్లెంలో డబ్బుల చోరీ.. షాకింగ్ వీడియో

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Sep 21 , 2025 | 07:39 PM