Pizza Delivery Boy Slapped: పిజ్జా డెలివరీ బాయ్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ.. నెట్టింట వెల్లువెత్తిన ఆగ్రహం
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:19 PM
పొరపాటున తన వాహనాన్ని ఢీకొట్టిన ఓ డెలివరీ బాయ్‌ని చెంప ఛెళ్లుమనిపించిన మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పేదవాడన్న లోకువతోనే ఆమె అతడిపై చేయి చేసుకుందంటూ జనాలు మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పిజ్జా డెలివరీ బాయ్ చెంప ఛెళ్లుమనిపించిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడిపై చేయి చేసుకున్నది చాలక మరింత దబాయిస్తూ రూ.30 వేలు డిమాండ్ చేస్తున్న వైనం చూసి జనాలు మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు. లఖ్నవూలో శనివారం వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది (Lucknow pizza delivery incident).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, రద్దీగా ఉన్న రోడ్డులో నానా అవస్థ పడుతూ బైక్ నడుపుతున్న ఆ పిజ్జా డెలివరీ బాయ్ పొరపాటున మహిళ టూ వీలర్‌ను ఢీకొట్టాడు. దీంతో, అగ్గిమీద గుగ్గిలమైన మహిళ ముందూ వెనుకా ఆలోచించకుండా అతడి చెంప ఛెళ్లుమనిపించింది. ఇష్టారీతిన అతడిని నిందించింది. తనకు జరిగిన నష్టానికి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతడికి డ్రైవింగ్ రాదంటూ మండిపడింది. ‘రోడ్డుపై వెళుతూ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? వాహనం నడపడం రాకపోతే రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు? తక్షణం డబ్బులు చెల్లించు.. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ అని బెదిరించింది (woman slaps delivery boy Lucknow).
ఇలా మహిళ రెచ్చిపోవడంతో షాకయిపోయిన డెలివరీ ఏజెంట్ తన వాదన వినిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఆమె దబాయింపుతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇతర డెలివరీ ఏజెంట్‌లను అక్కడికి పిలిపించి సమస్యను సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు కూడా మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అవతలివారిపై ఇలా చేయి చేసుకుని అవమానించొద్దని అన్నారు. దీంతో, మహిళ మరింత రెచ్చిపోయింది. ఉచిత సలహాలు ఇవ్వొద్దని చుట్టుపక్కల వారిపై నోరు పారేసుకుంది. తనకు నష్టం కలిగించినందుకు డెలివరీ బాయ్ డబ్బు చెల్లించాల్సిందేనని పేర్కొంది (road rage viral video India).
ఇక ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మహిళ చర్యలను అనేక మంది ఖండించారు. డెలివరీ బాయ్‌పై చేయి చేసుకున్నందుకు ఆమెపై ఫిర్యాదు చేయాలని అన్నారు. ‘జరిగింది చిన్న యాక్సిడెంట్ అయితే అతడు పేదవాడైనందుకు ఇంత అవమానకరంగా వ్యవహరించాలా? ఇలాంటి పని చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి’ అని కొందరు అన్నారు. డెలివరీ బాయ్ నుంచి రూ.30 వేలు డిమాండ్ చేయడం ఏం న్యాయం అని మరికొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
శాలరీ పెంచడం ఇష్టం లేక ఉద్యోగిని తొలగించిన కంపెనీకి భారీ షాక్
భారతీయ మహిళ దుమ్ము దులిపేసిన ఇటలీ వనిత.. తన భర్తను అవమానించిందని..