Salary Hike-Techie Fired: శాలరీ పెంచడం ఇష్టం లేక ఉద్యోగిని తొలగించిన కంపెనీకి భారీ షాక్
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:06 PM
శాలరీ పెంచమన్నందుకు తనను తొలగించిన ఓ సంస్థ చివరకు ఎలా చిక్కుల్లో పడిందీ చెబుతూ ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తనను కాదనుకున్న కంపెనీ చివరకు ఎలా తలకిందులైందో చెబుతూ ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రెడిట్‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ప్రపంచంలో న్యాయం ఇంకా మిగిలే ఉందన్న విషయం ఈ ఉదంతంతో తనకు అర్థమైందని ఆ టెకీ చెప్పుకొచ్చాడు.
రెడిట్‌లో ఆ టెకీ పెట్టిన పోస్టు ప్రకారం, అతడో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి బ్యాక్ ఎండ్‌లో అత్యంత కీలకమైన డాటా సింక్రనైజేషన్ తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. తనకంటూ సొంత టీమ్ లేకపోయినా పనంతా అతడొక్కడే నిర్వహిస్తుంటాడు. అయితే, తన జీతం సాటి ఉద్యోగులకంటే తక్కువని తెలిసి ఓ రోజున జీతం పెంపు కోరుతూ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించాడు. 10 శాతం శాలరీ హైక్ కోరినా మేనేజ్‌మెంట్ స్పందించలేదు. దీంతో, అతడు పనంతా తన నెత్తిన వేసుకోకుండా కొన్ని పరిమితులు విధించుకున్నాడు (company collapse salary hike denial).
ఈ క్రమంలో సంస్థలోకి కొత్త వ్యక్తి డైరెక్టర్‌గా వచ్చాడు. అతడు ఈ టెకీని పిలుపించుకుని ప్రశ్నించారు. విధులపై నిరాసక్తత ఎందుకని ప్రశ్నించగా ఆ టెకీ ఉన్నదున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అతడు కావాలనే పని ఎగ్గొడుతున్నాడని హెచ్‌ఆర్‌కు డైరెక్టర్ సమాచారం అందించాడు. దీంతో టెకీ తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, అతడిని జాబ్ నుంచి తొలగించినందుకు సంస్థ కొంత పరిహారం కూడా చెల్లించేందుకు అంగీకరించింది.
ఇది జరిగిన కొంత కాలానికి ఆ సంస్థలోని ఉద్యోగి టెకీకి తారసపడ్డాడు. టెకీ వెళ్లిపోయిన తరువాత సంస్థ పరిస్థితి తలకిందులైందని చెప్పాడు. టెకీని జాబ్‌లోంచి తీసేసిన డైరెక్టర్‌తోపాటు ఆయనను సిఫారసు చేసిన వైస్ ప్రెసిడెంట్ కూడా సంస్థను వీడాల్సొచ్చిందని చెప్పారు. టెకీ వీడాక సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయడం మానేసిందని, దాన్ని సరిదిద్దేందుకు ఏకంగా ఆరుగురిని కొత్తగా నియమించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటికే కస్టమర్లు తమ నమ్మకం కోల్పోవడంతో సంస్థకు దూరమయ్యారని ఫలితంగా, సంస్థలోని పెద్ద వ్యక్తులు కూడా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా ఆ ఉద్యోగి చెప్పినదంతా విన్నాక తనకు నవ్వొచ్చిందని, 10 శాతం జీతం పెంచనందుకు మొదటికే మోసం వచ్చిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
నీటి ట్యాంకులో ఇరుక్కుపోయి ఏనుగు అవస్థలు.. వీడియో వైరల్
భారతీయ మహిళ దుమ్ము దులిపేసిన ఇటలీ వనిత.. తన భర్తను అవమానించిందని..