Share News

Woman Stalks Cop: ఎస్ఐపై ఓ మహిళ వేధింపులు.. రక్తంతో ప్రేమ లేఖ రాసి.. ఏమైందంటే?

ABN , Publish Date - Dec 17 , 2025 | 02:17 PM

తనను ప్రేమించాలని అమ్మాయిలను బెదిరించే అబ్బాయిలను చూసుంటారు. తన ప్రేమను అంగీకరించకపోతే చనిపోతానని యువతులను బెదిరించే యువకులనూ చూసుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏకంగా ఎస్ఐనే ప్రేమిస్తున్నానని నిత్యం ఆయన్ను వేధిస్తోంది ఓ యువతి. అసలేమైందంటే...

Woman Stalks Cop: ఎస్ఐపై ఓ మహిళ వేధింపులు.. రక్తంతో ప్రేమ లేఖ రాసి.. ఏమైందంటే?
Bengaluru Police Inspector Harassed by Woman

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా అబ్బాయిలు.. తమను ప్రేమించాలని వెంటపడుతూ అమ్మాయిలను వేధిస్తుంటారు. ఆ ప్రేమను అంగీకరించడం కోసం.. యువకులు నానా తంటలూ పడటం చూస్తూనే ఉంటాం. అయితే.. ఈ కథనం అందుకు భిన్నం. ఏకంగా ఓ పోలీస్ అధికారినే ట్రాప్ చేసిన ఓ మహిళ.. తనను ప్రేమించాలని ఆయన్ను వేధిస్తోంది. లేదంటే తాను చనిపోతానని బెదిరిస్తూ.. రక్తంతో ఓ ప్రేమ లేఖ కూడా రాసిందా యువతి. ప్రస్తుతం.. కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఆ 'లవ్ స్టోరీ' వివరాలు మీ కోసం...


బెంగళూరు(Bengaluru)లోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌(Ramamurthy Nagar PS)లో జీజే.సతీశ్‌ అనే వ్యక్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు(Satish GJ). గత అక్టోబర్ 30న ఆయన మొబైల్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ యువతి ఫోన్ చేసి.. తాను రామమూర్తి నగర్ నివాసినని, తన పేరు సంజన అలియాస్ వనజ(Sanjana Alias Vanaja)గా పరిచయం చేసుకుని.. ఆయన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ ఎస్‌ఐ కూడా తనను ప్రేమిస్తున్నానని చెప్పాలని ఫోన్‌లో పట్టుబట్టిందామె. తొలుత దీన్ని ఓ చీటింగ్ కాల్‌గా భావించారా స్టేషన్ ఆఫీసర్. అయితే.. ఆ తర్వాత మరలా ఆ యువతి నుంచి పదే పదే కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయ్. వీటన్నింటినీ పట్టించుకోని ఆయన.. ఆమె కొత్త నంబర్ నుంచి ఫోన్ చేసిన ప్రతిసారీ ఆ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు.


హోం మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్..

అంతటితో ఆగని ఆ యువతి.. ఈ సారి ఇంకో ఎత్తుగడ వేసింది. తాను కాంగ్రెస్(Congress) కార్యకర్తనని చెప్పుకుంటూ.. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పింది. అలా కొందరు సీనియర్ నాయకులతో ఉన్న ఫొటోలు పంపించి తన ప్రేమను ఒప్పుకోవాలని ఎస్‌ఐని బెదిరించింది. స్పందించకపోతే రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తాననీ వ్యాఖ్యానించింది. ఓ సారి హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ ఇన్‌స్పెక్టర్‌కు కాల్ వచ్చేలా చేసింది. ఆ యువతి ఫిర్యాదును ఎందుకు విచారించడం లేదని వారు ఎస్ఐని ప్రశ్నించారు. ఆ మహిళ ఫిర్యాదు చేసేందుకు ఏనాడూ పీఎస్‌కు రాలేదని, ఆమె ఇష్టానుసారంగా ప్రవరిస్తోందని ఎస్ఐ సమాధానమిచ్చారు.


రక్తంతో ప్రేమలేఖ..

ఎస్ఐ సతీశ్ స్టేషన్‌లో లేని సమయంలో ఒకసారి అక్కడకు వెళ్లిన యువతి.. తాను సతీశ్‌కు బంధువునని చెప్పి.. ఆయన కార్యాలయంలో పూల బొకే, స్వీట్ బాక్స్ పెట్టేసి వెళ్లింది. తర్వాత ఆయనకు ఫోన్ చేసి వేధించసాగింది. తనకు అలాంటి వస్తువులేమీ పంపొద్దని ఫోన్‌లోనే హెచ్చరించాయన. అయినప్పటికీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయ్. 2025 నవంబర్ 7న సతీశ్.. ప్రజా ఫిర్యాదులను పరిశీలిస్తూ ఉండగా.. కార్యాలయంలోకి వచ్చి ఓ కవర్ అందజేసిందా యువతి. అందులో నెక్సిటో ప్లస్(Nexito Plus) - 20 మాత్రలతో పాటు.. తన ప్రేమను అంగీకరించాలని లేదంటే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులతో కూడిన లెటర్ ఉన్నట్టు తెలుస్తోంది. తన ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే తాను చనిపోతానని, ఆమె చావుకు ఎస్ఐ సతీశ్ బాధ్యత వహిస్తారని అందులో రాసింది. అంతేకాకుండా.. అందులో హార్ట్ సింబల్‌ సహా 'చిన్నీ లవ్ యూ, యు లవ్ మీ' అని ఆమె రక్తంతో రాశానని యువతి పేర్కొంది.


కంప్లైంట్ ఇచ్చినా..

ఆ యువతి వేధింపులను భరించలేక ఎస్ఐ సతీశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె గతంలో ఇతర పోలీస్ సిబ్బందితోనూ ఇదే తరహా వేధింపులకు పాల్పడిందని ఎస్ఐ తెలుపుతూ.. సీనియర్ అధికారులకు ప్రత్యేక నివేదిక సమర్పించారు. దీంతో కౌన్సిలింగ్(Counselling) కోసం ఓ పోలీస్ బృందం ఆమె ఇంటికి వెళ్లింది. అయితే.. ఆమె వారికి సహకరించకపోగా, కనీసం వారి కుటుంబ సభ్యుల వివరాలనూ చెప్పేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 12న మరోసారి ఆ యువతి పీఎస్‌కు వెళ్లి రచ్చ చేసింది. ఎస్ఐ పట్ల తన ప్రేమను ప్రకటిస్తూ.. ఆయన స్పందించకపోతే సూసైడ్(Suicide) చేస్కుంటానని బిగ్గర గొంతుతో అరిచింది. నిరాకరిస్తే ఆయన ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తానని బెదిరింపులకు పాల్పడింది.

ఆమె నిరంతర వేధింపులు తాళలేక.. ఎస్ఐ సతీశ్ మరోసారి అధికారికంగా ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరిత, ఆత్మహత్య సంబంధిత బెదిరింపులకు పాల్పడిందనే అభియోగాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు.


ఇవీ చదవండి:

వచ్చేస్తోంది భారత్‌ 'ట్యాక్సీ'.. ఇక డ్రైవర్లకు, వినియోగదారులకు...

పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

Updated Date - Dec 17 , 2025 | 02:40 PM