Affordable Indian Healthcare: భారత్‌లో చవకగా వైద్యం.. తెగ సంబరపడిపోయిన యూఎస్ మహిళ
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:57 AM
భారత్‌లో వైద్యం ఎంత చవకో చెబుతూ ఓ అమెరికా మహిళ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. రూ.1.7 లక్షల వైద్యం కేవలం రూ.50కే ఇక్కడ లభిస్తుందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో ఉంటున్న ఓ అమెరికా మహిళ భారత్‌లో వైద్యం ఎంత చవకైనదో తెగ సంబరపడిపోతూ తెలిపారు. ఇక్కడ రూ.50లో పూర్తయిన ట్రీట్‌మెంట్‌కు అమెరికాలో అయితే ఏకంగా రూ.1.7 లక్షలు చెల్లించాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (US woman Praises Indian Health Care).
క్రిస్టెన్ ఫిషర్ అనే మహిళ, తన భర్తతో కలిసి 2021లో భారత్‌కు వచ్చారు. ఢిల్లీలో ఓ డిజైన్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల వంటగదిలో ఉండగా ఆమె బొటన వేలికి గాయం అయ్యింది. ఈ క్రమంలో ట్రీట్‌మెంట్ కోసం వెళ్లినప్పుడు భారత్‌లో వైద్య వ్యవస్థ గొప్పదనం తెలిసొచ్చిందని అన్నారు (Kristen Fischer thumb injury).
‘కూరగాయలు తరుగుతుంటే బొటన వేలు తెగి రక్తం వచ్చింది. ఎంతకీ రక్తస్రావం ఆగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కుట్లు వేయకపోతే బ్లీడింగ్ ఆగదని అనిపించింది. చివరకు నేను, టిమ్ ఆసుపత్రికి వెళ్లాము. అక్కడ ఆసుపత్రి సిబ్బంది నన్ను ఓ ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నర్సులు బ్లీడింగ్ ఆపేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఈలోపు మరో నర్సు వచ్చి తనకు తెలిసిన విధానంలో కట్టు కట్టగానే రక్తస్రావం ఆగిపోయింది. బొటన వేలికి కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చని ఆమె తెలిపింది’
‘ఆ తరువాత రిసెప్షన్‌కు వెళితే జస్ట్ రూ.50 చెల్లించమని చెప్పారు. ట్రీట్‌మెంట్ ఖర్చు ఇంత తక్కువా అని నేను ఆశ్చర్యపోయాను. మొత్తం 45 నిమిషాల్లో ట్రీట్‌మెంట్ చేయించుకుని బయటకు వచ్చాను. అమెరికా కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది జస్ట్ 60 సెంట్లు. ఇక్కడ వైద్య ఖర్చులు చాలా తక్కువ. అమెరికాలో అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం కింద నెలకు 2 వేల డాలర్ల వరకూ చెల్లించాల్సి వచ్చేది’ అని ఆమె అన్నారు (Delhi hospital ₹50 treatment).
భారత్‌లో ఆసుపత్రులు పేషెంట్లకు చాలా దగ్గరలో ఉంటాయని, అపాయింట్‌మెంట్స్ కోసం వేచి చూడాల్సిన అగత్యం ఉండదని ఆమె తెలిపారు. ఇక్కడ ట్రీట్‌మెంట్ ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండటం మరో కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:
అమెరికాను వీడుతున్నా.. ఇకపై చేయాల్సింది ఇదే.. హెచ్-1బీ వీసాపై చైనా యువకుడి కామెంట్
ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్